భవానీపురం/పటమట(విజయవాడతూరు): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, ఈసీఐ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించడంలో సమష్టి భాగస్వామ్యం అవసరమని ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) వివేక్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం సీఈవో వివేక్ యాదవ్ విజయవాడ అర్బన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. చిట్టినగర్, కంసాలి పేట ప్రాంతాల్లోని పోలింగ్ స్టేషన్ 208, 217 పరిధిలో వీఎంసీ కమిషనర్, డెప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్టోరల్ ఆఫీసర్ ధ్యానచంద్రతో కలిసి క్షేత్రస్థాయిలో సర్ ప్రక్రియ తీరుతెన్నులను పరిశీలించారు. నియోజకవర్గం స్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను పరిశీలించి.. అక్కడి అధికారులు, సిబ్బంది అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. బూత్ లెవల్ అధికారులతో మాట్లాడి ప్రక్రియ అమలుపై ఆరా తీశారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిఢవిల్లేందుకు కీలకమైన ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణలో కీలక భాగస్వాములు కావాలని సీఈవో వివేక్ యాదవ్ కోరారు. ఈ పర్యటనలో విజయవాడ పశ్చిమ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్‌వో) ఎ.రవీంద్రరావు, సహాయ ఈఆర్‌వోలు ఎన్. శ్రీనివాసరావు, డి.హరీష్, జి.సృజన, చంద్రబోస్, ఇస్మాయిల్ తదితరులు ఉన్నారు.


