తిరుమలగిరికి పోటెత్తిన భక్తులు | - | Sakshi
Sakshi News home page

తిరుమలగిరికి పోటెత్తిన భక్తులు

Jul 5 2026 7:44 AM | Updated on Jul 5 2026 7:44 AM

తిరుమలగిరికి పోటెత్తిన భక్తులు అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి ఖననం చేసిన బాలిక మృతదేహానికి పోస్టుమార్టం ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీగా సత్యవతి వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

తిరుమలగిరి(జగ్గయ్యపేట): గ్రామంలో వేంచేసిన వెంకటేశ్వర స్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే పలు ప్రాంతాల ఉంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కొండ కింద స్వామి వారికి ప్రత్యేకంగా పాలపొంగళ్లు తయారు చేసి సమర్పించారు. పలువురు భక్తులు అన్నదానానికి విరాళాలు అందించారు. ఆలయ ఈఓ రంగారావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఆలయ చైర్మన్‌ వెంకటేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

గుణదల(విజయవాడ తూర్పు): కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన మాచవరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మాచవరం ఎలిశెల వారి వీధికి చెందిన ముత్యాల రాజేశ్వరరావు (39) నగర పాలక సంస్థలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతనికి భార్య శ్వేత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంత కాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం వీరిద్దరూ గొడవ పడ్డారు. ఈ గొడవలో భాగంగా శ్వేత కోపంగా ఇంటి నుంచి వెళ్లిపోయింది. క్షణికావేశానికి గురైన రాజేశ్వరరావు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చిన శ్వేతకు తన భర్త ఉరికి వేలా డుతూ కన్పించాడు. దీంతో ఆమె మాచవరం పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురీకి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఉంగుటూరు(గన్నవరం): ఉంగుటూరు మండలం వేంపాడు గ్రామంలో వారం రోజుల క్రితం ఖననం చేసిన బాలిక మృతదేహానికి శనివారం అధికారులు పోస్టుమార్టం నిర్వహించారు. గ్రామానికి చెందిన 9వ తరగతి సువర్ణ దీప్తి(14) గత నెల 28వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బాలిక మృతదేహాన్ని ఖననం చేసిన తర్వాత ఆమె మృతిపై కుటుంబ సభ్యుల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. బాలిక తల్లి మానస ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఉంగుటూరు పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఖననం చేసిన బాలిక మృతదేహాన్ని బయటకు తీశారు. తహసీల్దారు జాలాది విమలకుమారి, సీఐ బి.వి.శివప్రసాద్‌, ఎస్‌ఐ యు.గోవిందు సమక్షంలో వైద్యుల బృందం సువర్ణదీప్తి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించింది. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసు విచారణ చేపట్టానున్నట్లు సీఐ తెలిపారు.

చిలకలపూడి(మచిలీపట్నం): ఎస్సీ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా జె.సత్యవతి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఈడీగా బీసీ సంక్షేమాధికారి జి.రమేష్‌ ఇన్‌చార్జ్‌ బాధ్యతలు నిర్వహించారు. ఆ స్థానంలో కాకినాడ జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న సత్యవతిని ఉద్యోగోన్నతిపై ఈడీగా నియమించారు. ఆమె కృష్ణా జిల్లా కలెక్టర్‌ డి.కె.బాలాజీని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేసిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు.

మచిలీపట్నంటౌన్‌: నగరంలోని డాక్టర్‌ పట్టాభి గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో పలు కోర్సుల్లో ఉచిత శిక్షణ పొందేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తు న్నట్లు ఆ సంస్థ డైరెక్టర్‌ స్వర్ణశ్రీ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మహిళలకు బ్యూటీ పార్లర్‌ మేనేజ్‌మెంట్‌లో ఆగస్టు 11 నుంచి సెప్టెంబర్‌ 16వ తేదీ వరకు 35 రోజులు పాటు శిక్షణ ఉంటుందన్నారు. యువతీ యువకులకు కార్‌ డ్రైవింగ్‌ ఈనెల 10 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు, జ్యూట్‌ బ్యాగ్స్‌ తయారీ 14 రోజులు, ఆగస్టు 8 నుంచి సెప్టెంబర్‌ 5వ తేదీ వరకు ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ నేర్పిస్తామన్నారు. మహిళలకు ఆగస్టు 8 నుంచి సెప్టెంబర్‌ 9వ తేదీ వరకు టైలరింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆమె వివరించారు. మరిన్ని వివరాలకు 93907 74782 నంబర్‌ను సంప్రదించాలని ఆమె సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement