జిప్సం అక్రమాలపై అధికారుల కొరడా | - | Sakshi
Sakshi News home page

జిప్సం అక్రమాలపై అధికారుల కొరడా

Jul 5 2026 7:44 AM | Updated on Jul 5 2026 7:44 AM

కోడూరు మండలం వి.కొత్తపాలెం పీఏసీఎస్‌ త్రిసభ్య కమిటీ రద్దు ‘సాక్షి’ వరుస కథనాలతో విచారణ చేపట్టిన కేడీసీసీబీ అధికారులు అధికారిక పర్సన్‌ ఇన్‌చార్జిగా నాగమల్లేశ్వరరావు నియామకం

కోడూరు: మండలంలోని వి.కొత్త పాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్‌)లో జిప్సం నిల్వల వ్యవహారంలో చోటు చేసుకున్న అక్రమాలు చివరికి పాలకవర్గంపై వేటుకు దారితీశాయి. జిప్సం అక్రమాలపై ‘సాక్షి’లో ప్రచురించిన వరుస కథనాల నేపథ్యంలో కేడీసీసీ బ్యాంక్‌ సెంట్రల్‌ అధికారులు స్పందించి ప్రత్యేక విచారణ చేపట్టారు. ప్రాథమికంగా నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించారు. దీంతో సంఘానికి సంబంధించిన త్రిసభ్య కమిటీని రద్దు చేస్తూ కేడీసీసీబీ అధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

అక్రమంగా 300 బస్తాల జిప్సం నిల్వ

వి.కొత్తపాలెం పీఏసీఎస్‌లో సంఘ గోడౌన్‌లో అధికారిక స్టాక్‌లో నమోదు కాని 300 బస్తాల జిప్సంను సంఘ చైర్‌పర్సన్‌, జనసేన నేత రేపల్లె పిచ్చేశ్వరరావు అక్రమంగా నిల్వ చేసి, బ్లాక్‌ మార్కెట్‌ ద్వారా వీటిని విక్రయించేందుకు ప్రయత్నాలు చేశారు. స్టాక్‌కు సంబంధించిన ఓఫామ్‌లు, రవాణా చార్జీల కాగితాలు, ఇతర పత్రాలు లేకపోవడంతో వ్యవసాయ అధికారులు స్టాక్‌ను పరిశీలించి ‘స్టాప్‌ సేల్‌’ ఆదేశాలు జారీ చేశారు. స్టాక్‌ బయటకు తరలించకుండా గోడౌన్‌ను సీజ్‌ చేసి తాళాలు కూడా వేశారు. ఈ వ్యవహారంలో సంఘం సీఈఓ తోట శ్రీకాంత్‌, చైర్‌పర్సన్‌ పిచ్చేశ్వరరావు మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణపైనా కూడా అధికారులు దృష్టి సారించారు. బ్యాంక్‌ అధికారులను కొడతానంటూ ఫోన్‌ సంభాషణలో చైర్‌పర్సన్‌ హెచ్చరించడం, అక్రమ జిప్సంను నాగాయలంక మండలానికి గుట్టుచప్పుడు కాకుండా పంపేద్దామని మాట్లాడిన విధానాన్ని కూడా విచారణ అధికారులు పరిగణలోకి తీసుకున్నారు.

త్రిసభ్య కమిటీ రద్దు

విచారణలో వెలుగులోకి వచ్చిన ఆంశాల ఆధారంగా సంఘం నిర్వాహణలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని భావించిన అధికారులు త్రిసభ్య కమిటీపై చర్యలు చేపట్టింది. చైర్‌పర్సన్‌ రేపల్లె పిచ్చేశ్వరరావుతో పాటు సభ్యులు రేపల్లె నాగమల్లేశ్వరరావు, బాదర్ల నాగమల్లేశ్వరరావుతో కూడిన త్రిసభ్య కమిటీని రద్దు చేశారు. సంఘ కార్యకలాపాలు నిలిచిపో కుండా ఉండేందుకు అవనిగడ్డ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌, ఎస్‌డీఎల్‌సీఓ డి.నాగమల్లేశ్వరరావును పర్సన్‌ ఇన్‌ చార్జిగా నియమించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement