దుర్గగుడి ఆస్తుల రక్షణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

దుర్గగుడి ఆస్తుల రక్షణకు చర్యలు

Jul 5 2026 7:38 AM | Updated on Jul 5 2026 7:38 AM

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ఆస్తుల రక్షణకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ఈఓ శీనానాయక్‌ పేర్కొన్నారు. దేవస్థానానికి చెందిన కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలోని పలు భూములను ఈఓ శనివారం ఇంజినీరింగ్‌ అధికారులతో కలిసి పరిశీలించారు. తొలుత గూడవల్లిలోని జాతీయ రహ దారి సమీపంలోని దేవస్థాన భూములను పరిశీలించారు. స్థలంలో పిచ్చి మొక్కలు, ముళ్ల కంప పెరిగిపోవడంతో వెంటనే వాటిని తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. దేవస్థానం భూములు ఉన్న ప్రతి చోట బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం పాతపాడులోని దేవస్థాన పోలంలోని సోలార్‌ ప్లాంట్‌ను సందర్శించారు. పాతపాడు సోలార్‌ ప్లాంట్‌ ద్వారా నిత్యం ఏ మేరకు విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది, నెలకు ఆలయానికి ఎంత విద్యుత్‌ ఖర్చు అవుతోందన్న వివరాలను అధికారులను అడిగి ఈఓ తెలుసుకున్నారు. ప్రస్తుతం విద్యుత్‌ ప్లాంట్‌ ద్వారా నెలకు 1.20 లక్షల యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతోందని, దేవస్థానానికి నెలకు లక్ష యూనిట్ల విద్యుత్‌ వినియోగిస్తున్నామని అధికారులు వివరించారు. ప్రతి నెలా 20 వేల యూనిట్ల వరకు విద్యుత్‌ మిగులుతోందని తెలిపారు. విద్యుత్‌ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని నెట్‌ మీటరింగ్‌ పక్రియను అత్యంత వేగంగా పూర్తి చేయాలని ఈఓ శీనానాయక్‌ సూచించారు. దేవస్థాన భూములు, పొలాలు ఆక్రమణలకు గురి కాకుండా కట్టుదిట్టంగా చర్యలు చేపట్టాలన్నారు. ల్యాండ్‌ బ్యాంక్‌ వివరాలు భక్తులందరికీ తెలిసేలా డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో ఈఓ వెంట ఈఈ ఎల్‌.రమాదేవి, అసిస్టెంట్‌ ఇంజి నీర్‌ మస్తాన్‌, సునీల్‌కుమార్‌, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement