లబ్బీపేట(విజయవాడతూర్పు): రవాణాశాఖలో కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న వారికి హెడ్ కానిస్టేబుళ్లుగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (జేటీసీ) వడ్డే సుందర్ శనివారం ఆదేశాలు ఇచ్చారు. ఉద్యోగోన్నతి పొందిన కానిస్టేబుళ్లు ఏడుగురు ఎంజీ రోడ్డులోని కార్యాలయంలో ఉత్తర్వులు అందుకున్నారు. మచిలీపట్నానికి చెందిన వి.బాల కోటేశ్వరరావు, విజయవాడకు చెందిన కె.సుబ్బారెడ్డి, ఎన్.వెంకటేశ్వరరావు, ఎస్.సుబ్బారావు రాజమండ్రికి చెందిన ఎ.హనుమంతరావు, కాకినాడకు చెందిన ఎ.ఆర్.వి.సీహెచ్.రాజు, ఏలూరుకు చెందిన బి.నాగేశ్వరరావు ఉద్యోగోన్నతి పొందారు. వారిలో ఈ ఏడాది ఉద్యోగ విరమణ చేసే వారు కూడా ఉన్నారు. వారికి ప్రమోషన్లు కల్పించడం ద్వారా హెడ్ కానిస్టేబుళ్లుగా ఉద్యోగ విరమణ చేసే అవకాశం కల్పించినట్లు జేటీసీ వడ్డే సుందర్ తెలిపారు. రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న హెడ్ కానిస్టేబుళ్ల ఉద్యోగోన్నతులను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా చేపట్టడం ద్వారా సిబ్బందిలో నూతన ఉత్సాహం నెలకొందని రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు ఎం.రాజుబాబు, రవాణాశాఖ కానిస్టేబుళ్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జేటీసీ వడ్డే సుందర్‌కు అభినందనలు తెలిపారు. ఆర్‌జేటీసీ కార్యాలయ ఉద్యోగి కె.ఆర్.శ్రీకాంత్, రవాణాశాఖ ఉద్యోగులు, కానిస్టేబుళ్ల అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.


