గంపలగూడెం మండలంలో గవర్నర్‌ పర్యటన | - | Sakshi
Sakshi News home page

గంపలగూడెం మండలంలో గవర్నర్‌ పర్యటన

Jul 4 2026 2:25 AM | Updated on Jul 4 2026 2:25 AM

గంపలగూడెం: మండలంలో శుక్రవారం రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ పర్యటించారు. ఊటుకూరులోని ఓ కల్యాణ మండపంలో జరిగిన తన కార్యాలయ ఉద్యోగి దుర్గం గోపీ వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వ దించి శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ నుంచి ఊటుకూరుకు రాత్రి 7.50 గంటలకు చేరుకొని ఎనిమిది గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. వివిధ శాఖల అధికారులు పాల్గొనగా విజయవాడ రూరల్‌ డీసీపీ లక్ష్మీనారా యణ, మైలవరం ఏసీపీ రామచంద్రరావు, తిరువూరు సీఐ గిరిబాబు, తిరువూరు, విస్సన్నపేట, ఎ.కొండూరు, గంపలగూడెం ఎస్‌ఐలు, సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొదటి సారిగా రాష్ట్ర గవర్నర్‌ గంపలగూడెంలో పర్యటించడం గమనార్హం.

రైతులకు శాశ్వత సాగు నీటి భద్రత కల్పిస్తాం

వేదాద్రి(జగ్గయ్యపేట): రైతులకు శాశ్వత సాగు నీటి భద్రత కల్పిస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. రూ.15 కోట్ల అంచనాలతో గ్రామంలోని కృష్ణా నది ఒడ్డునున్న వేదాద్రి– కంచల ఎత్తిపోతల పథకం పునరుద్ధరణ పనులకు ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ.. ఈ ఎత్తిపోతల పథకం నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లోని 17,366 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందిస్తుందని పేర్కొన్నారు. 2027 ఖరీఫ్‌ నాటికి పనులు పూర్తి చేసి శాశ్వత సాగు నీటి భద్రత కల్పిస్తామన్నారు. వత్సవాయి మండలం పోలంపల్లి ప్రాజెక్టును కూడా త్వరలో ప్రారంభిస్తామన్నారు. అనంతరం రూ.33 లక్షల ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన పంపును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్‌, ఎమ్మెల్యేలు శ్రీరాం రాజగోపాల్‌, తంగిరాల సౌమ్య, నాయకులు గద్దె అనురాధ, కోట వీరబాబు, రాటకొండ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

6న రేబిస్‌ నిరోధక టీకాల కార్యక్రమం

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ప్రపంచ జూనోసిస్‌ దినోత్సవం సందర్భంగా ఈ నెల ఆరో తేదీన ఎన్టీఆర్‌ జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని పశువైద్యశాలల్లో ఉచిత రేబిస్‌ టీకాల కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ తెలిపారు. కలెక్టరేట్‌లో పశుసంవర్ధక శాఖ రూపొందించిన పోస్టర్‌ను కలెక్టర్‌ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని పెంపుడు కుక్కల యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.‘ఆరోగ్యకరమైన జంతువులు – ఆరోగ్యకరమైన మనుషులు – ఆరోగ్యకరమైన పర్యావరణం’ సూత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించి జూనోటిక్‌ వ్యాధుల నివారణకు సహకరించాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్‌ చంద్రశేఖరరావు, డాక్టర్‌ సునంద, డాక్టర్‌ మనోజ్‌, డాక్టర్‌ పంకజ్‌ పాల్గొన్నారు.

ట్రస్ట్‌ బోర్డు సమావేశం

7వ తేదీకి వాయిదా

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ట్రస్ట్‌ బోర్డు సమావేశం వాయిదా పడింది. శనివారం జరగాల్సిన ట్రస్ట్‌ బోర్డు సమావేశం ఈ నెల ఏడో తేదీకి మారినట్లు ఆలయ అధికారులు తెలిపారు. తొలుత ట్రస్ట్‌ బోర్డు సమావేశం బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి ఆవరణలో జరగాల్సి ఉంది. ఈ సమావేశాన్ని ఈ దఫా సీవీ రెడ్డి చారిటీస్‌ సమావేశ మందిరంలో నిర్వహించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. ఏడో తేదీన జరిగే ట్రస్ట్‌ బోర్డు సమావేశంలో దుర్గగుడి ఆలయ అభివృద్ధి పనులతో పాటు ఈ నెలలో జరిగే ఆషాఢ మాసోత్సవాలు, తెలంగాణ బోనాలు, శాకంబరీ ఉత్స వాల నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించే అవకాశం ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement