రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రాల ఏర్పాటును ఉపసంహరించాలి | - | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రాల ఏర్పాటును ఉపసంహరించాలి

Jul 4 2026 2:25 AM | Updated on Jul 4 2026 2:25 AM

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): రాష్ట్ర ప్రభుత్వం స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలో రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రాలు(ఆర్‌ఎస్‌కే) ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఎన్టీఆర్‌ జిల్లా దస్తావేజు లేఖరుల వృత్తి పరిరక్షణ సమితి శుక్రవారం గాంధీనగర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టింది. దస్తా వేజు లేఖరులు, అసిస్టెంట్లు, డీటీపీ ఆపరేటర్లు, స్టాంప్‌ వెండర్లు నల్లరిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చింతకాయల నాగ సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ.. మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై, పూణేలో ఆర్‌ఎస్‌కే వ్యవస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా లీజు, తనఖా వంటి రిజిస్ట్రేషన్లు మాత్రమే చేస్తోందన్నారు. కానీ ఏపీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి అన్ని రకాల రిజిస్ట్రేషన్లు చేయడానికి రంగం సిద్ధం చేస్తోందన్నారు. ఆర్‌ఎస్‌కేల ఏర్పాటుతో దస్తావేజు లేఖర్ల పొట్ట కొట్టడం భావ్యం కాదన్నారు. రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రాల ఏర్పాటు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే భవిష్యత్తులో తాము మరిన్ని నిరసన కార్యక్రమాలను చేస్తామని హెచ్చరించారు. ఎన్టీఆర్‌ జిల్లా దస్తావేజు లేఖర్ల వృత్తి పరిరక్షణ సమితి అధ్యక్షుడు పైలా సతీష్‌ మాట్లాడుతూ.. తాము దశాబ్దాల తరబడి దస్తావేజు లేఖర్లగా సేవలు అందిస్తున్నామని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ శాఖలో ఎన్ని కొత్త తరహా విధానాలు తీసుకొచ్చినా వాటన్నింటినీ నేర్చుకొని అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నామని వివరించారు. అయితే ప్రస్తుతం పీపీపీ విధానంలో ఈ రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రాల్లో కొత్తవారికి శిక్షణ ఇచ్చి ఉపయోగించుకోవడం కన్నా, ఎంతో అనుభవం, నైపుణ్యం గల దస్తావేజు లేఖర్లకు లైసెన్సులు, ఐడెంటిటీ ఇచ్చి తమ జీవన భృతిని కొనసాగించుకునేలా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో దస్తావేజు లేఖర్లు ఎం.చక్రధర్‌, ఎ.వరహాలరావు, సాంబశివరావు, వెంకటేశ్వర రావు, నరేంద్ర, కాజా రమేష్‌, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

దస్తావేజు లేఖరుల డిమాండ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement