రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రాజమండ్రి వద్ద గోదావరి నదిపై ఉన్న చారిత్రాత్మక ఆర్చ్ బ్రిడ్జి పునరుద్ధరణ పనుల్లో దక్షిణ కోస్తా రైల్వే విజయవాడ డివిజన్ అద్భుత మైలురాయి సాధించింది. నిత్యం రద్దీగా ఉండే విజయవాడ – విశాఖపట్నం మార్గంలోని గోదావరి నదిపై రైల్వే బ్రిడ్జి పునరుద్ధరణ ప్రాజెక్ట్‌లో ప్రయాణికులు, సరుకు రవాణా రైళ్లకు ఎటువంటి అంతరాయం లేకుండా 28 స్పాన్లలో 672 తుప్పుపట్టిన హ్యాంగర్ కేబుళ్ల స్థానంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక, తుప్పు నిరోధక 500 కేబుళ్లు ఏర్పాటు చేశారు. బ్రిడ్జి భద్రత, నిర్వహణను బలోపెతం చేసేందుకు ఆస్ట్రేలియాకు చెందిన ఇన్‌స్ట్రుమెంటేషన్ నిపుణులతో కలసి వంతెనపై అత్యాధునిక బ్రిడ్జి హెల్త్ మానిటరింగ్ సిస్టం కూడా ఏర్పాటుచేసి ప్రారంభించారు. వంతెన నిర్మాణ తీరును 24 గంటలూ ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు 272లకు పైగా స్మార్ట్ సెన్సార్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా మాట్లాడుతూ.. చారి త్రాత్మక గోదావరి ఆర్చ్ బ్రిడ్జిపై రైల్వే కార్యకలాపాలకు అంతరాయం లేకుండా 500 హ్యంగర్ కేబుళ్లను విజయవంతంగా మార్చడం ఇంజినీర్లు, ఫీల్డ్ బృందం అద్భుత ప్రతిభను కొనియాడారు.


