రేపు రోల్‌బాల్‌ ఎన్టీఆర్‌ జిల్లా జట్ల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రేపు రోల్‌బాల్‌ ఎన్టీఆర్‌ జిల్లా జట్ల ఎంపిక

Jul 4 2026 2:25 AM | Updated on Jul 4 2026 2:25 AM

రేపు రోల్‌బాల్‌ ఎన్టీఆర్‌ జిల్లా జట్ల ఎంపిక యువకుడిపై హత్యాయత్నం.. నిందితుడి అరెస్ట్‌ ఎట్టకేలకు ఆర్థిక సాయం అందజేత సీఏ ఫలితాల్లో శ్రీమేధ విద్యార్థుల ప్రతిభ రైలు పట్టాలపై గుర్తుతెలియని దివ్యాంగుడి మృతదేహం

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): కంకిపాడులోని క్యాపిటల్‌ స్పోర్ట్స్‌ కార్నర్‌ ఆవరణలో ఈ నెల 5వ తేదీ ఆదివారం ఉదయం 7 నుంచి 12గంటల వరకు ఎన్టీఆర్‌ జిల్లా రోల్‌బాల్‌ సెలక్షన్స్‌ నిర్వహిస్తున్నామని జిల్లా రోల్‌బాల్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ టి.లలిత ప్రియ ఓ ప్రకటనలో తెలిపారు. అండర్‌–11, 14, 17 విభాగాల్లో ఈ జట్ల ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు 9505950425లో సంప్రదించాల్సిందిగా ఆమె కోరారు.

తిరువూరు: మండలంలోని వావిలాలలో పాత కక్షల నేపథ్యంలో యువకుడిపై గొడ్డలితో దాడిచేసి, హత్య చేయడానికి శుక్రవారం అదే గ్రామానికి చెందిన వ్యక్తి యత్నించిన సంఘటన సంచలనం కలిగించింది. గ్రామానికి చెందిన దుగ్గిరాల నాగరాజుపై అతని సమీప బంధువు దుగ్గిరాల రమేష్‌ గురువారం అర్ధరాత్రి గొడ్డలితో దాడి చేశాడు. ఇంట్లో నిద్రిస్తున్న నాగరాజుపై హఠాత్తుగా దాడి చేయడంతో మెడపైన, వీపుపైన తీవ్ర గాయాలయ్యాయి. తృటిలో తప్పించుకున్న నాగరాజు గ్రామస్తుల సహాయంతో తిరువూరు ఏరియా ఆస్పత్రిలో చేరాడు. రమేష్‌ పరారవ్వగా.. పోలీసులు గాలించి శుక్రవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. గతంలో మద్యం మత్తులో నాగరాజు తనపై దాడిచేయడంతో కక్షసాధింపుగా అతనిపై దాడికి పాల్పడినట్లు రమేష్‌ చెప్పినట్లు ఎస్‌ఐ శాతకర్ణి తెలిపారు.

మచిలీపట్నంటౌన్‌: నగరంలోని ఆస్థానాలు, పంజాల మరమ్మతు పనులకు ఎట్టకేలకు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం నగదును అందజేశారు. మొహర్రం దుఃఖ దినాల సందర్భంగా ప్రభుత్వం ముందస్తుగానే ఆస్థానాలు, పంజాలకు మరమ్మతులు, రంగులు వేసేందుకు రూ. 5వేల చొప్పున ఇవ్వాల్సి ఉంది. కానీ కూటమి ప్రభుతం దుఃఖ దినాలు ముగిసిన తర్వాత ముస్లింల డిమాండ్‌ల నడుమ శుక్రవారం నగరంలోని 139 ఆస్థానాలు, పంజాలకు రూ. 7.45లక్షలను మంజూరు చేసింది. ఈ మెత్తాలను నగరంలోని రాజుపేట షాదీఖానాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి రవీంద్ర వాటిని నిర్వాహకులకు అందజేశారు. ఏపీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు, జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ చైర్మన్‌ బండి రామకృష్ణ, మార్కెట్‌ యార్డ్‌ కమిటీ చైర్మన్‌ కుంచె దుర్గాప్రసాద్‌ నాని తదితరులు పాల్గొన్నారు.

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) శుక్రవారం ప్రకటించిన సీఏ ఫౌండేషన్‌ ఫలితాల్లో శ్రీమేధ విద్యార్థులు సత్తా చాటినట్లు సంస్థ చైర్మన్‌ అన్నా నందకిషోర్‌ తెలిపారు. గుంటూరు కొత్తపేటలోని శ్రీమేధ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నందకిషోర్‌ మాట్లాడుతూ జి. వంశీప్రియ 400 మార్కులకు 286 మార్కులతో టాపర్‌గా నిలిచాడని చెప్పారు. సీహెచ్‌ తన్మయి 283, ఎస్‌. రేణుక నందిని 272, వై.తన్విశ్రీ 267, షేక్‌ మొయినుద్దీన్‌ 258 మార్కులు సాధించినట్లు తెలిపారు. ఇందుకు శ్రీమేధ అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది సహకారం ఎంతో ఉందని తెలిపారు. సీఏ ఫౌండేషన్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సీఏ ఇంటర్‌ తరగతులు ఈనెల 20 నుంచి ప్రారంభం కానున్నాయని వివరించారు. డైరెక్టర్‌ అన్నా శ్రీలక్ష్మి పాల్గొన్నారు.

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): రైలు పట్టాలపై ఓ దివ్యాంగుడి మృతదేహం లభ్యమైంది. ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్‌పీ) తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం రామవరప్పాడు యార్డ్‌ వద్ద పట్టాలపై వ్యక్తి మృతి చెంది ఉండటాన్ని గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న జీఆర్‌పీ సిబ్బంది వివరాలు సేకరించారు. మృతుడు సుమారు 45ఏళ్ల దివ్యాంగుడని, ఒంటిపై తెలుపు రంగు చొక్కా, నలుపు రంగు ప్యాంట్‌ ధరించి ఉన్నాడని, ఇతర ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు విజయవాడ జీఆర్‌పీ స్టేషన్‌లో సమాచారం అందించాలని కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement