అనంతపురంలో అదుపులోకి తీసుకున్నామన్న డీసీపీ రామకృష్ణ
ఇబ్రహీంపట్నం: నకిలీ రూ.500 నోట్లు చెలామణి, తయారీ కేసులో మరో ఇద్దరు వ్యక్తులను ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం పోలీసులు అనంతపురంలో శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద 100 నకిలీ రూ.500 నోట్లు, దొంగనోట్లు తయారీకి ఉపయోగించిన పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో డీసీపీ గుణ్ణం రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు వెల్లడించారు.
పరికరాలు స్వాధీనం..
జూన్ 30న దొంగనోట్లు చెలామణి చేస్తున్న గుంజా మంగారావు, వల్లభనేని పవన్‌కుమార్‌లను అదుపులోకి తీసుకున్నామన్నారు. గుంజా మంగారావు ఇచ్చిన సమాచారం మేరకు సీఐ సుబ్రహ్మణ్యం, క్రైం ఎస్‌ఐ ఎస్.శ్రీనివాసరావు అనంతపురం వెళ్లి నకిలీ రూ.500 నోట్లు తయారు చేస్తున్న పుల్లలరేవు రాజా, పొదిలి భాస్కరరావులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. నిందితులతో పాటు నోట్లు తయారీకి ఉపయోగించిన రెండు కలర్ ప్రింటర్లు, ఒక ల్యాప్ టాప్, ఒక స్కానర్, ల్యామినేటర్ ఒకటి, ఆరు సెల్‌ఫోన్లు, 500 నోట్లు 100 (రూ.50వేలు) స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. కేసు రిపోర్ట్ అయిన మరుసటి రోజే ప్రధాన నిందితుడు అనంతపురానికి చెందిన పుల్లలరేవు రాజా, హిందూపురానికి చెందిన పొదిలి భాస్కరరావును అరెస్ట్ చేసినందుకు సీఐ సుబ్రహ్మణ్యం, క్రైం ఎస్‌ఐ ఎస్.శ్రీనివాసరావు, సిబ్బందిని అభినందించారు. ఈ కేసులో మిగతా నిందితుల కోసం రెండు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులు అయిన పుల్లాలరేవు రాజా, పొదిలి భాస్కరరావుపై వివిధ సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్లు డీసీపీ రామకృష్ణ వివరించారు. సీఐ సుబ్రహ్మణ్యం, క్రైం ఎస్‌ఐ ఎస్.శ్రీనివాసరావు పాల్గొన్నారు.


