చిన్న క్లూ కూడా దొరక లేదు! | - | Sakshi
Sakshi News home page

చిన్న క్లూ కూడా దొరక లేదు!

Jul 4 2026 2:25 AM | Updated on Jul 4 2026 2:25 AM

ఏటిలో నిజాలు వెలుగు చూసేదెప్పుడో?

పోలీసులకు సవాలుగా మారిన జంట హత్యల కేసు వారం గడుస్తున్నా కనిపించని పురోగతి విస్తృతంగా దర్యాప్తు చేస్తున్న బృందాలు

కృత్తివెన్ను: నిండు ప్రాణాలు నీటిపాలు.. చంపేసిన ఆనవాళ్లు ఏటిపాలు అన్నట్లుంది చినగొల్లపాలెం జంటహత్యల మిస్టరీ. కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెంలో జంట హత్యలు జరిగి వారం రోజులు కావస్తోంది.. మృతదేహాలు లభ్యమై ఐదు రోజులైంది. కానీ హంతకులకు సంబంధించి చిన్న సమాచారం కూడా పోలీసులకు దొరకలేదు. రెండు జిల్లాలోనూ జల్లెడేసి గాలిస్తున్నా నిందితులు ఆచూకీ కొంచెం కూడా లభించకపోవడం ఈ కేసు పోలీసు యంత్రాంగానికి సవాల్‌గా మారింది. జిల్లా ఎస్పీ ఆదేశాలతో బందరు డీఎస్పీ నలుగురు సీఐలు, ఎస్‌ఐలు బృందాలుగా ఏర్పడి విస్తృతంగా గాలిస్తున్నారు.

సముద్రంపై అవగాహన ఉన్నవారే?

హత్య చేయడం.. మృతదేహాలను వారి బైక్‌కే కట్టి నీటిలో వేసేయడం చూస్తుంటే ఇది కచ్చితంగా సముద్రంపై అవగాహన ఉన్న వారు మాత్రమే చేయగలరని స్థానికుల అనుమానం. క్షణికావేశంలో హత్య చేసినా ఈ విధంగా ఏటిలో మృతదేహాలను జలసమాధి చేయాలంటే పడవ నడపడం, ఏటిలోతు తదితర అంశాలపై పూర్తిగా తెలిసిన వారే ఇది చేసుండాలని అంటున్నారు. బయట వ్యక్తులు అర్ధరాత్రి ఆ ప్రాంతంలో హత్య చేయడం, శవాన్ని మాయం చేయడం కష్టమైన పనని, ఇది పూర్తిగా ఆ ప్రదేశాలపై అవగాహన ఉన్నవారు మాత్రమే చేసుంటారన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిందితులను గుర్తించి, కఠినంగా శిక్షించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

జల్లెడేసినా జాడలేదు..

నిందితుల కోసం పోలీసులు అణువణువూ వదలకుండా గాలిస్తున్నారు. కానీ కేసులో మాత్రం పురోగతి లేదు. అనుమానితులను తీసుకొచ్చి విచారణ చేసినా ఫలితం శూన్యం. మృతులు యానాది సామాజిక వర్గానికి చెందిన వారు అదే సామాజిక వర్గంలో ఏమైనా విభేదాలుండి ఇలా జరిగిందా? అన్న కోణంతో పాటు, తమకు చేపల వేటలో భవిష్యత్తులో పోటీ అవుతారన్న అనుమానంతో వేరే సామాజిక వర్గం వారు ఈ దురాగతానికి పాల్పడి ఉంటారా అన్న అన్ని కోణాలను పరిశీలిస్తున్నారు. అయినా ఎక్కడా కొంచెం కూడా క్లూ లభించకపోవడం పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ కేసులో నిందితులను పట్టుకుని కేసుకు త్వరలో ముగింపు పలికి ఈ ప్రాంతంలో భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు పోలీసులను కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement