మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నంటౌన్: ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత చేరువ చేసి వారి సమస్యలను సత్వరం పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మంత్రి తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి సంబంధిత శాఖలకు పంపిస్తూ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారని మంత్రి తెలిపారు. మచిలీపట్నం నియోజకవర్గంలో ఇప్పటి వరకు మొత్తం 540 అర్జీలు అందగా, వాటిలో 447 అర్జీలను ఇప్పటికే పరిష్కరించామని చెప్పారు. మరో 77 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిలో 55 అర్జీలు గడువులోనే ఉండగా, గడువు దాటిన 22 అర్జీల పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించి త్వరితగతిన పరిష్కరిస్తామని వెల్లడించారు. మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ (నాని), రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ హసీం బేగ్ తదితరులు పాల్గొన్నారు.


