నిరుద్యోగుల్లో నైరాశ్యం! | - | Sakshi
Sakshi News home page

నిరుద్యోగుల్లో నైరాశ్యం!

Jul 3 2026 1:28 AM | Updated on Jul 3 2026 1:28 AM

నియామకాలపై కాలయాపన ఏల? ఆరు నెలలైనా..

ఉమ్మడి కృష్ణా వైద్య ఆరోగ్యశాఖలో 60 కాంట్రాక్ట్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ ఆరు నెలలు గడిచినా నియామకాలు శూన్యం దరఖాస్తు రుసుము రూపంలో సుమారు రూ.9 లక్షల వసూలు ఆప్కాస్‌ ఆమోదం లేదన్న సాకుతో నియామక ప్రక్రియ నిలిపివేత

ఆప్కాస్‌ ఆమోదం పొందాలి..

నియామకాలపై కాలయాపన ఏల?
ఆరు నెలలైనా..

మచిలీపట్నంఅర్బన్‌: ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నిరుద్యోగ యువతకు వైద్య, ఆరోగ్యశాఖ మరోసారి మొండి చేయి చూపింది. ఉద్యోగాలు భర్తీ చేస్తామని నోటిఫికేషన్‌లు జారీ చేసి, ఆపై నియామకాలు నిలిపివేయాలన్న ప్రభుత్వ నిర్ణయం నిరుద్యోగులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఆప్కాస్‌ ఆమోదం లేదంటూ కుంటి సాకులు చెబుతూ.. నియామక ప్రక్రియను నిలిపివేయడం వెనుక అసలు ఉద్దేశం పోస్టులను ప్రైవేట్‌ కాంట్రాక్టర్లకు అప్పగించడమేనన్న ఆరోపణలు బలపడుతున్నాయి.

ఇదే మొదటిసారి కాదు..

గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. 2024 డిసెంబర్‌లో జారీ చేసిన నోటిఫికేషన్‌ను 2025 డిసెంబర్‌లో రద్దు చేయడం వల్ల నిరుద్యోగుల్లో తీవ్ర నిరాశ, అనిశ్చితి నెలకొంది. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ పరిధిలో మూడు కేటగిరీలకు సంబంధించిన మొత్తం 22 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఇందులో ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌–2 పోస్టులు 4, ఫిమేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లీ పోస్టులు 8, శానిటరీ అటెండర్‌ కమ్‌ వాచ్‌మన్‌ పోస్టులు 10 ఉన్నాయి. ఈ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి 2024 డిసెంబర్‌ 16 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అయితే, 2025 డిసెంబర్‌లో ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. అదే నెలలో మొత్తం 60 పోస్టులతో కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఇందులో ఒక పోస్టు ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌–2, ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌–2 పోస్టులు 07, నాలుగు డేటా ఎంట్రీ ఆపరేటర్‌, 10 పోస్టులు లాస్ట్‌ గ్రేడ్‌ సర్వీసెస్‌ కేడర్‌కు చెందినవి ఉన్నాయి. అలాగే పీహెచ్‌సీల్లో 12 ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌–2 పోస్టులు, 16 ఫిమేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లీ పోస్టులు, 10 శానిటరీ అటెండెంట్‌ కం వాచ్‌మన్‌ కేడర్‌ పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన భర్తీ చేస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దీని కోసం 2025 డిసెంబర్‌ 22 నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఆ తర్వాత దీనిపై ఒక్క అడుగూ ముందుకు పడలేదు. ఇలా తరచూ నోటిఫికేషన్లు రద్దు చేయడం, మార్పులు చేయడం వల్ల నిరుద్యోగుల్లో విశ్వాసం దెబ్బతింటోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు పీహెచ్‌సీల్లో క్యాడర్‌ పోస్టుల నియామకాలను ప్రస్తుతం నిలుపుదల చేశాం. మిగతా ఎన్‌యూహెచ్‌ఎం పోస్టులకు సంబంధించిన ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తాం. పీహెచ్‌సీల్లోని క్యాడర్‌ పోస్టులకు ఆప్కాస్‌ ఆమోదం వచ్చిన వెంటనే అవి కూడా నియామకాలు చేపడతాం.

– డాక్టర్‌ పి. యుగంధర్‌, కృష్ణా జిల్లా

వైద్య, ఆరోగ్యశాఖ అధికారి

ఎన్‌యూహెచ్‌ఎంలో 22, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీలు) 38 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసి, 2025 డిసెంబర్‌ 22 నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఆరు నెలలు గడిచినా నియామక ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో ఈ 60 ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన నిరుద్యోగులు నిరాశ చెందుతున్నారు. ఈ పోస్టులకు మొత్తం 2,994 దరఖాస్తులు అందగా, దరఖాస్తు రుసుముల రూపంలో అభ్యర్థులు సుమారు రూ.9 లక్షలు చెల్లించారు. అయినప్పటికీ నియామకాలపై ఎలాంటి పురోగతి లేకపోవడం అభ్యర్థుల్లో తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement