జి.కొండూరు: వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ్ పథకంతో ఉపాధి హామీ కూలీలకు సరికొత్త భరోసా కలుగుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. జి.కొండూరు మండల పరిధిలోని చెవుటూరు గ్రామంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో జరిగిన వీబీ జీరామ్ జీ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ, ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్‌తో కలిసి గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండ్ల వాగు ఫీడర్ చానల్ అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం జి.కొండూరు కమ్యూనిటీ హాల్ వద్ద జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ వీబీ జీరామ్ జీ పథకం ద్వారా ఉపాధి హామీ పనిదినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడంతో పాటు రోజువారీ వేతనాన్ని రూ.307 నుంచి రూ.312కు పెంచారన్నారు. ఎంపీపీ వేములకొండ లక్ష్మీ తిరుపతమ్మ, డ్వామా పీడీ ఎ.రాము, ఏపీడీ (విజయవాడ) శ్రీనివాస్, జిల్లా ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మచిలీపట్నంఅర్బన్: స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్‌లో గురువారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య అధికారులు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, ఎంఎల్‌హెచ్‌పీలు కోసం యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణను డాక్టర్ పోతన శాస్త్రి, డాక్టర్ శ్రీధర్ అందించగా, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ జవాద్ ఖాన్, డీపీఎంఓ డాక్టర్ అరుణ్ పర్యవేక్షించారు. మధుమేహం, అధిక రక్తపోటు, గర్భిణులు, ప్రసవానంతర తల్లులు సహా జీవనశైలి సంబంధిత వ్యాధుల నివారణ, నియంత్రణలో యోగా ప్రాముఖ్యతపై శిక్షణార్థులకు సమగ్ర అవగాహన కల్పించారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఉద్యోగ జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని(స్ట్రెస్) సమర్థంగా నిర్వహించడం ప్రతి ఉద్యోగికి అత్యంత అవసరమని ఎన్టీఆర్ కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ఉద్యోగులు మానసిక సమతుల్యత, సానుకూల దృక్పథం, సమయపాలనతో విధులు నిర్వర్తించినప్పుడే ప్రజలకు మరింత నాణ్యమైన సేవలు అందించగలరని పేర్కొన్నారు. ప్రత్యేక సామర్థ్య నిర్మాణ (కెపాసిటీ బిల్డింగ్) సెషన్లలో భాగంగా గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం జరిగింది. సైకాలజిస్టులు తేజావతి, జి.శంకర్ రావు, టీఎస్ రావు, బి.నవితశ్రీ బృందం రోజువారీ విధుల నిర్వహణలో ఒత్తిడిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. కార్యక్రమంలో మొత్తం 50 స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఉద్యోగులు, సమన్వయకర్త జి.జ్యోతి పాల్గొన్నారు.
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ నేత దేవినేని అవినాష్ ఈ నెల 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు అమెరికా వెళ్లేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది. అమెరికా వెళ్లేందుకు వీలుగా ఆయన పాస్‌పోర్ట్‌ను తిరిగి ఇవ్వాలని కింది కోర్టును ఆదేశించింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితునిగా ఉన్న అవినాష్.. కోర్టు ఆదేశాల మేరకు తన పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేశారు. అమెరికాలో తన బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లేందుకు అనుమతినివ్వాలని, పాస్‌పోర్ట్ వెనక్కి ఇవ్వాలని కోరుతూ గుంటూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను గత నెల 16న కోర్టు కొట్టేసింది. దీనిపై అవినాష్ హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు కింది కోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తూ గురువారం తీర్పు వెలువరించారు. అవినాష్ అమెరికా పర్యటనకు అనుమతినిచ్చారు. భారత దేశానికి తిరిగి వచ్చి, ఈ నెల 13న దర్యాప్తు అధికారి లేదా కింది కోర్టు ఎదుట హాజరుకావాలని అవినాష్‌ను ఆదేశించారు. అమెరికా ప్రయాణ ప్రణాళికను సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు, కింది కోర్టుకు సమర్పించాలని చెప్పారు.


