● గ్రీన్ ట్రిబ్యూనల్ ఆదేశాలు బేఖాతర్
● వందలాది టిప్పర్లతో ఇసుక దోపిడీ
● ఇసుక మాఫియాపై న్యాయపోరాటం
● మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్
పమిడిముక్కల: ‘పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నామని సీఎం, డెప్యూటీ సీఎం చెబుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మొక్కలు నాటుతున్నారు. అయితే గ్రీన్ ట్రిబ్యూనల్ ఆదేశాలు బేఖాతర్ చేస్తూ కృష్ణా నదిలో యథేచ్ఛగా ఇసుక దోపిడీ చేస్తున్నారు. పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నారు. ఇదేమి పాలన’ అంటూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్ ప్రశ్నించారు. చోరగుడిలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గంలోని లంకపల్లి, రొయ్యూరు క్వారీల్లో అధికార పార్టీ నాయకుల ఇసుక దోపిడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఆదేశాల మేరకు జూన్ రెండు నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు నదిలో ఇసుక తవ్వకాలు జరపకూడదని నిబంధనలు స్పష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీ సమావేశం పెట్టి నిబంధనల ప్రకారం ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని, అతిక్రమిస్తే కేసులు పెట్టాలని హెచ్చరించారని గుర్తు చేశారు. అయినా నదిలో నిత్యం యథేచ్ఛగా ఇసుక దోపిడీ జరుగుతోందని తెలిపారు. ఈ దోపిడీ గురించి తెలిసినా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఒక్క లారీని కూడా ఆపి క్రిమినల్ కేసు నమోదు చేసిన దాఖలాలు లేవన్నారు. కలెక్టర్, ఎస్పీ, తహసీల్దార్ సీఐ, ఎస్‌ఐకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, ఇసుక దోపిడీని ఆపడం లేదని, దీనిపై న్యాయస్థానంలో పోరాటం చేస్తానని పేర్కొన్నారు. పమిడిముక్కల సీఐ తన పరిధిలోని లంకపల్లి, రొయ్యూరు క్వారీల నుంచి వందలాది టిప్పర్లు ఇసుక తరలిపోతుంటే ఎందుకు నిలుపుదల చేయడం లేదని ప్రశ్నించారు. ఇసుక రీచ్‌లోకి వెళ్లకుండా గండి కొట్టామని కలెక్టర్, తహసీల్దార్ చెబుతున్నారని, నదిలో పొక్లెయిన్, ఇసుకతో తరలివెళ్తున్న టిప్పర్లు కనబడతున్నాయని, కావాలంటే వారికి ప్రత్యక్షంగా చూపిస్తానని అన్నారు. వర్షం పడితే ఇబ్బంది లేకుండా అనకొండల్లా ఇసుక నిల్వ చేశారని, నదిలో ఇంకెంత దోచుకొంటారని ప్రశ్నించారు. ఇసుక దోపిడీపై తోట్లవల్లూరు, పమిడిముక్కల పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేస్తామని, పట్టించుకోకపోతే జిల్లా, మండల అధికారులపై ప్రజాప్రయోజన వ్యాజ్యం వేస్తానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు యలమంచిలి గణేష్, పార్టీ నాయకులు మర్రి బాబూరావు, పాతూరి చంద్రపాల్, గవాస్కర్ రాజు, వైస్ ఎంపీపీ గంజాల సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.


