రోజువారీ విధుల్లో హిందీ తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

రోజువారీ విధుల్లో హిందీ తప్పనిసరి

Jul 3 2026 1:28 AM | Updated on Jul 3 2026 1:28 AM

రోజువారీ విధుల్లో హిందీ తప్పనిసరి

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): రోజు వారీ విధుల్లో హిందీ తప్పనిసరి అని విజయవాడ రైల్వే డీఆర్‌ఎం మోహిత్‌ సోనాకియా పేర్కొన్నారు. డీఆర్‌ఎం అధ్యక్షతన అధికార భాష అమలు కమిటీ సమావేశం గురువారం డీఆర్‌ఎం కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా మోహిత్‌ సోనాకియా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో అధికార భాష హిందీని సమర్థవంతంగా అమలు చేయడం ఉద్యోగుల బాధ్యతని అన్నారు. అధికార భాషపై పార్లమెంటరీ కమిటీ తనిఖీ జరిగే అవకాశం ఉన్నందున దైనందిన కార్యాలయ పనులు, ఉత్తర ప్రత్యుత్తరాల్లో హిందీని వినియోగించాలని స్పష్టంచేశారు. ప్రతి తనిఖీ నివేదికలో కనీసం ఒక అంశాన్ని హిందీలో పొందుపరచాలని అధికారులను ఆదేశించారు. డివిజన్‌లో అధికార భాష అమలులో నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో రాజభాష విభాగం కృషిని అభినందించారు. ఏడీఆర్‌ఎం పి.ఇ.ఎడ్విన్‌ మాట్లాడుతూ.. అధికార భాష అమలుకు నిర్దేశించిన లక్ష్యాలను విజయవాడ డివిజన్‌ గణనీయంగా అధిగమించిందన్నారు. హిందీలో నోటింగ్‌ కోసం నిర్దేశించిన 35 శాతం లక్ష్యానికి గాను 87.87 శాతం, హిందీలో వచ్చిన ఉత్తరాలకు అదే భాషలోనే సమాధానం ఇవ్వాలన్న 60 శాతం లక్ష్యానికి గాను 88 శాతం నమోదు చేసుకుందని వివరించారు. అనంతరం సీనియర్‌ రాజభాష అధికారి హేమంత్‌ వాడేకర్‌ త్రెమాసికంలో డివిజన్‌లో రాజభాష అమలులో భాగంగా ఉద్యోగుల కోసం నిర్వహించిన హిందీ వర్క్‌షాపులు, సెమినార్‌లు, టేబుల్‌ ట్రైనింగ్‌ కార్యక్రమాలను వివరించారు. దైనందిన అధికారిక పనుల్లో హిందీ వినియోగాన్ని మరింత పెంచాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా డీఆర్‌ఎం చేతుల మీదుగా అధికార భాష త్రైమాసిక మ్యాగజైన్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం కొండా శ్రీనివాసరావు, చీఫ్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎ.వి.ఎస్‌.కె.ప్రసాద్‌, పలు విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

డీఆర్‌ఎం మోహిత్‌ సోనాకియా

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement