కృష్ణలంక(విజయవాడతూర్పు): చైన్ స్నాచింగ్ కేసులో ఇద్దరు నిందితులను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద రూ.2.28 లక్షల విలువైన 15.2 గ్రాముల బంగారు నానుతాడు, మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్ కార్యలయంలో ఈ కేసు వివరాలను సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ ఎం. కిషోర్‌బాబు విలేకరులకు వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. పెనమలూరు మండలం పోరంకికి చెందిన నరందాస్ చిన్మయి సాయిదుర్గారావు గతంలో నమోదైన ఒక కేసులో రిమాండ్ ఖైదీగా విజయవాడ జైలులో ఉన్న సమయంలో మోదుగు రాజారావుతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో జైలు నుంచి విడుదలైన అనంతరం ఇద్దరూ కలిసి చైన్ స్నాచింగ్‌లు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో మోటార్ సైకిల్‌పై కొత్తగూడెం వైపు వెళ్తూ మైలవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని మగళాపురం క్రాస్ రోడ్డు వద్ద బడ్డీ కొట్టులో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి మెడలో బంగారు నానుతాడును లాక్కుని పారిపోయినారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందడంతో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం పది గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్‌లో పదో ప్లాట్‌ఫాం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న నరందాస్ చిన్మయి సాయిదుర్గారావు, మోదుగు రాజారావును సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. 15.2 గ్రాముల బంగారు నానుతాడు, మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.


