ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడాన్ని అడ్డుకుంటాం రూ.6 వేల కోట్ల విలువైన ఆర్టీసీ భూములు బినామీలకు ధారాదత్తం ప్రజల పక్షాన ఆర్టీసీ పరిరక్షణకు ఉద్యమిస్తాం వైఎస్సార్ సీపీ నేతలు వెలంపల్లి, అవినాష్, మల్లాది విష్ణు
ఆర్టీసీ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం..
భవానీపురం(విజయవాడపశ్చిమ): దశాబ్దాలుగా రాష్ట్ర ప్రజానీకానికి సేవలందిస్తున్న ప్రజా రవాణా(ఆర్టీసీ) సంస్థను మరింత బలోపేతం చేయాల్సిందిపోయి ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెట్టేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ చర్యలను అడ్డుకుంటామని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పశ్చిమ ఇన్‌చార్జి వెలంపల్లి శ్రీనివాస్, పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు హెచ్చరించారు. దాదాపు రూ.6 వేల కోట్ల విలువైన ఆర్టీసీ భూములను ప్రభుత్వ పెద్దలు తమ బినామీలకు ధారాదత్తం చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఆర్టీసీ సంస్థకు చెందిన డిపోలను ఒక్కొక్కటిగా ప్రైవేట్‌కు కట్టబెట్టి నిర్వీర్యం చేసేందుకే ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు. ఆర్టీసీ సంస్థను పరిరక్షించుకునేందుకు ప్రజల పక్షాన ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. విజయవాడ విద్యాధరపురంలో నేలమట్టం చేసిన ఆర్టీసీ డిపోను వారు మంగళవారం పరిశీలించారు. డిపోలో ధ్వంసం చేసిన కట్టడాలు, డీజిల్ ఆయిల్, సీఎన్‌జీ బంకులు, గ్యారేజీ షెడ్ తదితరాలను చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ–బస్‌ల నిర్వహణ పేరుతో డిపోలను ఖాళీ చేయించి ప్రజల ఆస్తులను ధ్వంసం చేసే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిదని ప్రశ్నించారు. పాలకులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర మండిపడ్డారు.
కూటమి ప్రభుత్వ విధ్వంసకర
పాలనకు నిదర్శనం
సుమారు 50 వేల మందికిపైగా ఉద్యోగులు పని చేస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ భవిష్యత్‌పై వారితో సంప్రదించకుండా, ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా ఏకపక్షంగా విద్యాధరపురం డిపో కూల్చివేత కూటమి ప్రభుత్వం విధ్వంసకర పాలనకు నిదర్శనం కాదా అని వెలంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో భూములు విలువ పెరగటం, అందునా బైపాస్ రహదారి పక్కనే ఉన్న డిపోను కబ్జా చేసి తమ అనుయాయులకు కట్టబెట్టేందుకే ప్రభుత్వం ఈ దుశ్చర్యలకు పాల్పడిందన్నారు. ఎలక్ట్రికల్ బస్‌ల నిర్వహణ కోసం ఈ ప్రాంతంలో సంస్థకు చెందిన అనేక ఖాళీ స్థలాలు ఉండగా ఉద్యోగులతో సందడి సందడిగా ఉండే ఈ డిపోను ఎంచుకోవడంలో ప్రభుత్వం కుట్ర బహిర్గతమవుతుందన్నారు. ఆర్టీసీ ఆస్తులు, భూములు ఆ సంస్థ ఆధీనంలోనే ఉండాలన్నారు.
ఖరీదైన భూములపై ప్రభుత్వ పెద్దల కన్ను..
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఖరీదైన ప్రభుత్వ, ఆర్టీసీ భూములపై ప్రభుత్వ పెద్దల కన్ను పడిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. గతంలో లులు మాల్ కోసం ఏలూరు రోడ్‌లో ఉన్న ఖరీదైన ఆర్టీసీ భూమిని కేటాయించినప్పుడు వైఎస్సార్ సీపీ పోరాటంతో ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. ఇప్పుడు విద్యాధరపురం డిపో స్థలాన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే కుట్ర జరుగుతుందన్నారు. ప్రజాభిప్రాయాలను పట్టించుకోకుండా బినామీల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం వెంపర్లాడుతుందన్నారు. ఆర్టీసీ సంస్థ ఆస్తుల పరిరక్షణ కోసం ఉద్యోగులతో కలిసి ఉద్యమ కార్యాచరణ రూపొందించి పోరాడతామని తెలిపారు.
ఇసుక, మట్టి, మైనింగ్ కొండలను స్వాహా చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఆర్టీసీ భూములపై కన్నేసిందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. రాష్ట్రంలోని 12 ఆర్టీసీ డిపోలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రక్రియలో భాగంగానే విద్యాధరపురం డిపోను ఎంచుకున్నారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఆర్టీసీ బలోపేతానికి రూ.5వేల కోట్ల స్థిరీకరణ నిధి ఏర్పాటుతో పాటు సంస్థను ప్రభుత్వంలో విలీనం చేశారని గుర్తు చేశారు. ఆర్టీసీని నిర్వీర్యం చేసే ప్రభుత్వ చర్యలను వైఎస్సార్ సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. గత ప్రభుత్వంలో నిర్మించిన మెడికల్ కాలేజీలు, పోర్టులను కూడా ప్రైవేట్ పరం చేయడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులు, పలువురు మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.


