వెస్ట్‌ బైపాస్‌లో ఘోర ప్రమాదం.. | - | Sakshi
Sakshi News home page

వెస్ట్‌ బైపాస్‌లో ఘోర ప్రమాదం..

Jul 1 2026 2:10 AM | Updated on Jul 1 2026 2:10 AM

వెస్ట్‌ బైపాస్‌లో ఘోర ప్రమాదం..

ముగ్గురు దుర్మరణం కృష్ణా జిల్లా బీబీగూడెం వద్ద దుర్ఘటన

గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని బీబీగూడెం వద్ద విజయవాడ వెస్ట్‌ బైపాస్‌పై మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల బాలుడు, అతని తల్లి, మరో వ్యక్తి దుర్మరణం చెందారు. ఏలూరు జిల్లా కై కలూరు మండలం పెంచికలపర్రుకు చెందిన సోదరులు జయమంగళ వెంకట విజయ్‌కుమార్‌, వెంకటరాజు పొక్లెయిన్లు నడుపుతుంటారు. వారి తల్లి రమాదేవి విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, చూసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి కారులో వచ్చారు. వెంకటరాజు భార్య, పిల్లలు ఆస్పత్రి వద్ద ఆగిపోగా, మిగిలిన వారు కై కలూరుకు తిరిగి కారులో బయలుదేరారు. పశ్చిమ బైపాస్‌పై బీబీగూడెం సమీపంలోకి రాగానే, వెనుక నుంచి వేగంగా వస్తున్న కంటైనర్‌ ముందు టైరు పంక్చర్‌ కావడంతో ఒక్కసారిగా అదుపుతప్పింది. ముందు వెళ్తున్న ట్యాంకర్‌తోపాటు వీరి కారును ఢీకొట్టి కొంత దూరం ఈడ్చుకువెళ్లింది. ఈ ప్రమాదంలో కంటైనర్‌, ట్యాంకర్‌ మధ్య కారు ఇరుక్కుపోయి పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. కారు వెనుక సీటులో కూర్చున్న వెంకట విజయ్‌కుమార్‌ భార్య బాల వెంకట నాగదుర్గ (28), కుమారుడు కారుణ్య నాగసాయి(4) అక్కడికక్కడే మృతిచెందారు. కారు నడుపుతున్న వెంకటరాజు, ముందు సీట్లో కూర్చున్న విజయ్‌ కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనలో ట్యాంకర్‌ అదుపుతప్పి స్కూటీని ఢీకొట్టడంతో దానిపై వెళ్తున్న విజయవాడ సింగ్‌నగర్‌కు చెందిన హోటల్‌ కార్మికుడు దాసరి వెంకటేశ్వరరావు (49) కూడా మృతిచెందాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement