మిస్టరీగానే జంట హత్యలు | - | Sakshi
Sakshi News home page

మిస్టరీగానే జంట హత్యలు

Jul 1 2026 2:10 AM | Updated on Jul 1 2026 2:10 AM

పచ్చని పల్లెలో కలకలం రేపిన హత్యలు

ముమ్మరంగా కొనసాగుతున్న

పోలీసుల దర్యాప్తు

మృతుడు సుబ్బన్న ఇంటి వద్ద విచారంలో బంధువులు హత్య జరిగిన ప్రాంతంలో పడి ఉన్న చేపలు

కృత్తివెన్ను: కక్షలు కార్పణ్యాలకు అతీతంగా ఉండే పచ్చని పల్లెలో జంట హత్యల కలకలం మిస్టరీగా మారింది. అందరి నోటా ఒకటే మాటా మృతులు వివాదరహితులు ఎవరితోనూ విభేదాలు లేవు కానీ చంపేశారు. చంపడమే కాకుండా వారి మృతదేహాలను వారి బండి(బైక్‌)కే కట్టి నీటిలో జలసమాధి చేయడంతో దీవి వాసులు హడలిపోతున్నారు.

ఇంత కర్కశమా..

మండల చరిత్రలో ఇప్పటి వరకు ఈ తరహాలో హత్యలు జరిగింది లేదు. ఏకంగా అల్లుడూ మామను చంపి ఏటిపాయలో వదిలేయడంపై సర్వత్రా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తీరప్రాంతంలో సరికొత్త తరహాలో హత్యలకు పునాది వేయడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతులు శెట్టి సుబ్బన్నకు ఎవరితోనూ ఎటువంటి వివాదాలు లేవని స్థానికులు చెబుతున్నారు. యానాది సామాజిక వర్గానికి చెందిన సుబ్బన్నకు రెండు బోటులున్నాయని ఆర్థికంగా ఉన్నతంగానే ఉన్నట్లు తెలుస్తుంది. రెండు నెలల నుంచి ఇక్కడే ఉంటున్న పశ్చిమగోదావరి జిల్లా రుస్తుంబాదుకు చెందిన సుబ్బన్న అల్లుడు గొలుసు అయ్యప్పకు కూడా ఇక్కడ ఎవరితోనూ విభేదాలు లేవంటున్నారు. పోలీసుల విచారణలో కూడా ఇదే విషయం తేలింది. అయినా ఇటువంటి హత్యకు కారణం ఏమిటన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది.

రెండు జిల్లాల్లో గాలింపు..

ఈ హత్యలో ఒకరిద్దరి కంటే ఎక్కువ మంది పాత్ర ఉండవచ్చనే అనుమానాలు ఉన్నాయి. మృతదేహాలు లభించిన కొద్దిదూరంలోనే కొన్ని చేపలు నేలపై పడి ఉన్నాయి. అంటే చేపల వేట పూర్తయిన తరువాతే హత్య జరిగి ఉండవచ్చన్నది స్థానికులు చెబుతున్నారు. పోలీసులు ఈ హత్య కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇప్పటికే మూడు బృందాలు రంగంలో దిగాయి. ఎస్పీ ఐటీ కోర్‌ టీం సైతం గాలింపులో ఉన్నట్లు తెలిసింది. రెండు జిల్లాలోనూ గాలింపు ముమ్మరం చేసినట్లు బందరు రూరల్‌ సీఐ నాగేంద్రప్రసాద్‌ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement