యోగా చాంపియన్‌ ఆనంద్‌ దేశానికే గర్వకారణం | - | Sakshi
Sakshi News home page

యోగా చాంపియన్‌ ఆనంద్‌ దేశానికే గర్వకారణం

Jul 1 2026 2:10 AM | Updated on Jul 1 2026 2:10 AM

మచిలీపట్నంటౌన్‌: అంతర్జాతీయ యోగా చాంపియన్‌ ఆనంద్‌ దేశానికే గర్వకారణమని కృష్ణా జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ కొనియాడారు. మంగళవారం ఇంటర్నేషనల్‌ యోగా చాంపియన్‌ ఆనంద్‌ కలెక్టర్‌ డీకే బాలాజీ, కలెక్టర్‌ తండ్రి కృష్ణయ్యశెట్టితో కలిసి ఘనంగా సన్మానించారు. స్థానిక గాంధీనగర్‌లోని వాకర్స్‌ అసోసియేషన్‌ హాల్‌లో యోగా శిక్షణకు ఆనంద్‌ ప్రత్యేక అతిథిగా హాజరై, సభ్యులకు అడ్వాన్స్‌డ్‌ యోగా శిక్షణ ఇచ్చారు. యోగ సాధనలో సంపూర్ణ ఫలితాల కోసం పలు సలహాలు, సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ బాలాజీ మాట్లాడుతూ.. ఇండియాలోనే కాకుండా విదేశాల్లోని వేలాది మంది యోగ సాధకులకు నిత్యం యోగ శిక్షణ ఇస్తూ, వారంతా పోటీల్లో విజేతలుగా నిలిచి, మెడల్స్‌ సాధించేందుకు విశేషంగా కృషి చేస్తున్న ఆనంద్‌ దేశానికే గర్వకారణమని అభినందించారు. అనంతరం ఆనంద్‌, జాతీయ స్థాయి యోగా గోల్డ్‌ మెడలిస్ట్‌ బీకే రాముడిని యోగా సభ్యులందరూ సన్మానించారు. శిక్షణా కార్యక్రమంలో జాతీయ యోగా విజేతలు బీకే రాముడు, శీలం రమేష్‌, వాకర్స్‌ అసోసియేషన్‌ ట్రస్టీ యారా జగన్‌మోహన్‌రావు, యోగా గురువులు పాల్గొన్నారు.

ఉరేసుకుని వివాహిత మృతి

వేదాద్రి(జగ్గయ్యపేట): ఉరేసుకుని వివాహిత మృతి చెందిన ఘటన గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన లాహోరి శ్రీకాంత్‌ గ్రామంలో డీజే ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ఐదేళ్ల క్రితం తెలంగాణాకు చెందిన అఖిల(25)ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. కొంత కాలంగా భార్యభర్తల మధ్య మనస్పర్థలు రావటంతో ఇరు వర్గాల పెద్దలు సర్ది చెబుతున్నారు. ఈక్రమంలో సోమవారం రాత్రి దంపతులు ఘర్షణ పడ్డారు. తెల్లవారు జామున అఖిల ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి మారుతి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

తాళం వేసిన ఇళ్లలో భారీ చోరీ

80 కాసుల బంగారం, 44 తులాల వెండి, 9 లక్షల నగదు అపహరణ

పాయకాపురం(విజయవాడరూరల్‌): నున్న పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని శాంతినగర్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. రొట్టెల పండుగ సందర్భంగా నెల్లూరు వెళ్లిన వారి ఇళ్లలో దొంగలు పడి కోటి రూపాయల విలువైన 80 కాసుల బంగారం, 44 తులాల వెండి వస్తువులు, రూ.9 లక్షల నగదు దోచుకెళ్లారు. ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం మేరకు.. విజయవాడలో బైక్‌ మెకానిక్‌లుగా పని చేస్తున్న షేక్‌ చాన్‌బాషా, షేక్‌ రెహ్మాన్‌ అన్నదమ్ములు. వారి ఇద్దరి కుటుంబాలు జూన్‌ 26న నెల్లూరులో జరిగిన రొట్టెల పండుగ కోసం ఇళ్లకు తాళాలు వేసి వెళ్లారు. మంగళవారం తిరిగి వచ్చిన వారికి తమ ఇళ్ల తాళాలు పగుల గొట్టి ఉండటాన్ని గుర్తించారు. ఇళ్లలోకి వెళ్లి చూడగా బీరువాల తాళాలు ధ్వంసం చేసి అందులో దాచిన 80 కాసుల బంగారు నగలు, 44 తులాల వెండి వస్తువులతో పాటు రూ.9 లక్షల నగదును దొంగలు చోరీచేసినట్లు గుర్తించారు. ఈ ఘటనపై నున్న సీఐ షేక్‌ అహ్మద్‌ ఆలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బాధిత కుటుంబానికి పరామర్శ

భారీ చోరీ జరిగిన విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. పోలీసు కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. క్లూస్‌ టీమ్‌ను, డాగ్‌ స్క్వాడ్‌ను రంగంలోకి దింపి నిందితులను గుర్తించి అరెస్ట్‌ చేసి, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని నున్న సీఐ అహ్మద్‌ ఆలీని కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement