ఇంద్రకీలాద్రిపై దుర్గగుడి సిబ్బంది చేతివాటం రూ.500 టికెట్లు పక్కదారి పట్టింపు కాంట్రాక్ట్ ఉద్యోగిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న వైనం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వీఐపీలు, సిఫార్సు లేఖలపై అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులను కట్టడి చేసి ఆలయానికి ఆదాయాన్ని పెంచాలని దుర్గగుడి అధికారులు రోజుకో టెక్నాలజీని తీసుకువస్తుండగా, ఆలయంలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ సిబ్బంది అమ్మవారి ఆదాయానికే గండికొడుతున్నారు. అధికారులు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా సిబ్బంది తీరులో మాత్రం మార్పు రావడం లేదు. సోమవారం నుంచి దేవస్థానంలో తిరుమల తిరుపతి తరహాలోనే వీఐపీ, బ్రేక్ దర్శనాలు కల్పించేందుకు కొత్త విధానాన్ని తెరపైకి తీసుకురాగా, అదే రోజు సాయంత్రం కాంట్రాక్ట్ సిబ్బంది రూ.500 టికెట్లను ఆరింటిని దారి మళ్లిస్తూ పట్టిపడిన వైనం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన సోమవారం సాయంత్రం పంచహారతుల అనంతరం చోటు చేసుకోగా, ఈ వ్యవహారాన్ని ఆలయ అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా, సదరు కాంట్రాక్టు ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు.
ఆరు టికెట్లు పక్కదారి..
దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సభ్యుడు అవ్వారు శ్రీనివాసరావుకు సంబంధించిన కొంత మంది భక్తులు సోమవారం సాయంత్రం అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. అయితే శ్రీనివాసరావు వారిని ప్రొటోకాల్ కార్యాలయానికి వెళ్లాలని సూచించారు. అదే తరుణంలో దేవస్థానంలో ఓ బ్యాంక్ తరుఫున ఐటీ విభాగంలో ఉద్యోగం చేస్తున్న విక్రాంత్ అనే యువకుడు ప్రొటోకాల్ కార్యాలయం వద్దకు వచ్చి దర్శనం చేయిస్తానని చెప్పాడు. శ్రీనివాసరావు తాలుకా 10 మంది, విక్రాంత్ తనతో పాటు మరో 10 మంది భక్తులు కలిపి మొత్తంగా 18 మందికి రూ.500 టికెట్లను అతను కొనుగోలు చేశాడు. అక్కడ కేవలం 12 టికెట్లను మాత్రమే ఆలయ సిబ్బందికి ఇచ్చాడు. ఈ వ్యవహారాన్ని శ్రీనివాసరావు గమనించారు. విక్రాంత్ మూడు టికెట్లు స్కానింగ్ చేయించకుండా తన వద్ద ఉంచుకున్నాడు. మిగతా మూడు టికెట్లను మహిళా సెక్యూరిటీ గార్డు వద్ద దాచినట్లు ఆలయ అధికారులు విచారణలో గుర్తించారు. సదరు వ్యవహారాన్ని ఆలయ ఈవో శీనానాయక్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తుంది. బుధవారం ఆలయ ఈవో శీనానాయక్ విధులకు హాజరవుతున్న తరుణంలో ఈ వ్యవహారంపై ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.


