ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ కుటుంబ సమేతంగా మంగళవారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన వారిని ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు శంకర్ శాండిల్య, ట్రస్ట్ బోర్డు సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు(బుల్లాబ్బాయ్) అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు, పట్టువస్త్రాలను అందించారు.
అనుమానాస్పద స్థితిలో కానిస్టేబుల్ మృతి
చల్లపల్లి: అనుమానాస్పద స్థితిలో ఓ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన మండల పరిధిలోని రాముడుపాలెం పుష్కర ఘాట్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కొలుసు శివరామకృష్ణ(35) తన భార్యతో సహా తోట్లవల్లూరులోని అత్త(స్వయాన శివరామకృష్ణ అక్క) ఇంటికి వచ్చారు. అయితే మంగళవారం తోట్లవల్లూరు నుంచి కారులో బయలుదేరిన శివరామకృష్ణ సాయంత్రం రాముడుపాలెం పుష్కర ఘాట్ వద్ద నీటిలో పడిపోయి చనిపోయి కనిపించాడు. స్థానికులు సమాచారం ఇవ్వటంతో ఎస్‌ఐ డి.దుర్గాంజనేయులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. వివరాలు సేకరించి అనుమానాస్పద మృతిగా నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తోట్లవల్లూరు నుంచి ఇక్కడకు ఎందుకు వచ్చాడనేది ప్రశ్నార్థకంగా మారింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
22.71 శాతం
ఫారాల డిజిటలైజేషన్
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో సర్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోందని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా 16,53,294 ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశామని, వాటిలో ఇప్పటికే 3,89,175 (22.71శాతం) ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందన్నారు. ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.


