పామర్రు: ఆధ్యాత్మిక, మానసిక వికాసానికి యోగా మార్గం ఎంతో దోహద పడుతుందని పతంజలి దక్షణ భారతదేశ పతంజలి ఇన్‌చార్జి రిత్ దేవ్ బాబా అన్నారు. సమగ్ర శిక్ష విద్యాశాఖల ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రగతి జూనియర్ కళాశాల ప్రాంగణంలో మంగళవారం 200 మంది వ్యాయామ ఉపాధ్యాయులకు వారం రోజుల యోగా శిక్షణ తరగతులను డీఈవో యువీ సుబ్బారావుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రిత్ దేవ్ బాబా మాట్లాడుతూ.. యోగ సాధనతో శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా శక్తి యుక్తులు పొందగలుగుతారన్నారు. హరిద్వార్‌లో ఉచిత యోగ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. డీఈవో సుబ్బారావు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం, క్రమశిక్షణ గల జీవితం పెంపొందించేందుకు యోగా ఎంతో దోహద పడుతుందన్నారు.
ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం యోగా ప్రధానాచార్యులు డాక్టర్ రాధిక మాట్లాడుతూ.. యోగ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలోనే కాకుండా ఆసియా ఖండ స్థాయిలో విద్యార్థులను పోటీలకు పంపుతున్నామన్నారు. విజయవాడ సిద్ధార్థ కళాశాలలో ఇటేవల నిర్వహించిన జాతీయ స్థాయి యోగా పోటీలకు విశేష స్పందన లభించిందన్నారు. కార్యక్రమంలో ఏఎంవో శ్యామ్, గుడివాడ డీవైఈవో పద్మారాణి, ఎంఈవోలు భాను ప్రసాద్, పద్మవాణి, శ్రీలక్ష్మి, ఏవీ రమణ, ఎస్.శ్రీకాంత్, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు గ్రహీత స్టేట్ విన్నర్, యోగా గురువులు ముదిగొండ శాస్త్రి, బెనర్జీ లీలావతి మాట్లాడారు. మచిలీపట్నం బాలాజీ విద్యాలయం విద్యార్థి శోభశ్రీ వేసిన యోగాసనాలు అందరినీ ఆకట్టుకున్నాయి.


