అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని సహించం | - | Sakshi
Sakshi News home page

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని సహించం

Jun 30 2026 3:17 AM | Updated on Jun 30 2026 3:17 AM

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని సహించం

కలెక్టర్‌ డీకే బాలాజీ

చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజల సమస్యలు పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్‌ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు ఇన్‌చార్జ్‌ డీఆర్వో పోతురాజు, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్‌ డెప్యూటీ కలెక్టర్‌ నీలకంఠేశ్వరరెడ్డి, డీఎస్పీ శ్రీనివారావు అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో అర్జీదారుని సమస్యలను పరిశీలించి నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. ప్రజల సమస్యలు పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావులేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. తొలుత గుండెపోటుతో మృతి చెందిన డెప్యూటీ తహసీల్దార్‌ పామర్తి శ్రీనివాస్‌ చిత్రపటానికి కలెక్టర్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజల నుంచి మొత్తం 142 అర్జీలు స్వీకరించామని కలెక్టర్‌ చెప్పారు.

వచ్చిన అర్జీల్లో కొన్ని..

● మచిలీపట్నంలోని చింతగుంటపాలెం ప్రాంతానికి చెందిన చట్టి నరసమ్మ కలెక్టర్‌కు అర్జీ ఇస్తూ.. తాను అనాథనని, స్థానిక బెరాకా మినిస్ట్రీస్‌ వసతి గృహంలో ఉంటూ ఎంసెట్‌ పరీక్షలు రాశానని చెప్పారు. ఇప్పుడు ఉన్నత విద్యలో ప్రవేశానికి ఆదాయ ధ్రువీకరణ పత్రం అవసరమైందని, అలాగే తనకు రేషన్‌కార్డు కూడా మంజూరు చేయాలని కోరారు.

● ప్రకృతి సమతుల్యాన్ని కాపాడి సునామీ, తుపానుల నుంచి సముద్రతీర ప్రాంతాలకు కవచంలా ఉండే మడ అడవులకు రక్షణ కరువైందని ఆర్టీఐ కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్‌ కలెక్టర్‌కు వివరించారు. అవనిగడ్డ, మచిలీపట్నం డివిజన్ల పరిధిలోని తీరప్రాంతాల్లో సుమారు 34,006 హెక్టార్లలో మడ అడవులు ఉన్నాయని, వీటిని నరికివేసి ఆక్రమణదారులు రొయ్యల చెరువులుగా మార్చేస్తున్నారని.. నిబంధనల ప్రకారం వీరిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

● పెదపారుపూడి మండలం దూళ్లవానిగూడెం గ్రామంలోని ఎంపీపీ పాఠశాలను ప్రస్తుతం సీఎస్‌ఐ చర్చి భవనంలో నిర్వహిస్తున్నారని ఆ భవనాన్ని ఖాళీ చేయాలని చర్చి యాజమాన్యం కోరటంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. గ్రామంలో ప్రభుత్వభూములు అందుబాటులో ఉన్నందున ఆ ప్రాంతంలో పాఠశాల భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని వారు వినతిపత్రంలో కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement