వేములనర్వ(వత్సవాయి): చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఎన్నికల్లో అలివికాని హామీలను ఇచ్చిన కూటమి నాయకులు తీరా అధికారంలోనికి వచ్చిన తరువాత వాటి అమలును పట్టించుకోకుండా సొంత ప్రజయోజనాలను చూసుకుంటున్నారని ప్రజలు భావిస్తున్నారు. సంక్షేమ పాలన అందించాలంటే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికే సాధ్యమని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి వైఎస్సార్ సీపీ జగ్గయ్యపేట నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ సమక్షంలో జనసేన, టీడీపీకి పలువురు రాజీనామా చేసి పార్టీలో చేరారు. జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పొదిలి లక్ష్మీనారాయణతోపాటు, టీడీపీ సీనియర్ నాయకుడు రాచబంటి చంద్రశేఖర్ మరో 12 కుటుంబాల వారు పార్టీలో చేరారు. మర్రి లక్ష్మీనారాయణ, రాచబంటి పుల్లారావు, మల్లాది వెంకటేష్, మాతంగి బాబురావు, మాతంగి దేవమణి, దాది సురేష్, రాచబంటి తిరుపతిరావు, కమతం రాజు, రాచబంటి నానికి అవినాష్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.


