చోరీ కేసులో నిందితుల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

చోరీ కేసులో నిందితుల అరెస్టు

Jun 30 2026 3:17 AM | Updated on Jun 30 2026 3:17 AM

పెనమలూరు: దొంగతనాలకు ప్పాడుతున్న ఇద్దరు నిందితులను పెనమలూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను డీఎస్పీ ధర్మేంద్ర సోమవారం వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. పెనమలూరుకు చెందిన డి.సాయితేజ (బబ్లూ) (26), విజయవాడ చిట్టినగర్‌కు చెందిన బిరుదుకోట పవన్‌కుమార్‌ (20), మరో బాలుడు ముఠాగా ఏర్పడ్డారు. వీరు గతంలో పలు దొంగతనాలు, ఏటీఎంల వద్దకు వచ్చిన వారిని మోసగించడం, గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఈ నెల 24వ తేదీన కానూరులో హోటల్‌ రూమ్‌ బుక్‌ చేసుకున్నారు. కామయ్యతోపు సెంటర్‌ వద్ద ఉన్న ఏటీఎం వద్దకు వచ్చారు. అక్కడ ఉన్న బోలెం సుమంత్‌ను నమ్మించి తమకు ఆన్‌లైన్‌లో సొమ్ము బదిలీ చేస్తే చేతికి నగదు ఇస్తామని నమ్మించారు. సుమంత్‌ ఫోన్‌పే ద్వారా రూ.8 వేలు వారికి బదిలీ చేశాడు. అనంతరం డబ్బులు ఇస్తామంటూ సుమంత్‌ను హోటల్‌ రూమ్‌కు తీసుకు వెళ్లారు. అక్కడ వారు అతడిని చంపేస్తామంటూ బెదిరించి మరో రూ.14,400 ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నారు. సుమంత్‌ వద్ద ఉన్న బంగారు గొలుసు, రెండు వెండి ఉంగరాలను దౌర్జన్యంగా లాక్కుని పరారయ్యారు. ఈ ఘటనపై బాధితుడు ఫిర్యాదు చేయటంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుల కోసం గాలిస్తుండగా ఆదివారం సాయంత్రం నిందితులు డి.సాయితేజ, పవన్‌కుమార్‌ కానూరు వద్ద పట్టుబడ్డారు. వారి వద్ద 16 గ్రాముల బంగారు గొలుసు, ఎనిమిది గ్రాముల వెండి ఉంగరాలను స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరీని అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితుడైన బాలుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని డీఎస్పీ ధర్మేంద్ర తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్‌ఐలు టి.వి.వెంకటేశ్వరరావు, సుధాకర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement