చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో అందుబాటులో ఉన్న పైప్‌లైన్ గ్యాస్ కనెక్షన్లను ప్రతి కుటుంబం తీసుకుని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డి.కె.బాలాజీ సూచించారు. సోమవారం రాత్రి కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వినియోగదారులు, పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రేషన్ కార్డుల పంపిణీ, ప్రజాపంపిణీ వ్యవస్థ, పైప్‌లైన్ గ్యాస్ కనెక్షన్లు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. రేషన్ బియ్యం పంపిణీ, క్యూఆర్ కోడ్ అధారిత సరఫరా విధానం, అంత్యోదయ పథకం తదితర అంశాలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు బియ్యం సకా లంలో చేరేలా రవాణా వ్యవస్థను సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. ప్రతి నెలా పంపిణీ సమ యంలో ఎదురయ్యే సమస్యలను మండలాల వారీగా గుర్తించి రూట్ల వారీగా అవసరమైన చోట అదనపు వాహనాలను సమకూర్చాలని పేర్కొన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా డోర్ డెలివరీకి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, డీఎస్‌ఓ మోహన్‌బాబు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ టి.శివరామప్రసాద్, ఐసీడీఎస్ పీడీ ఎం.ఎన్.రాణి, గిరిజన సంక్షేమశాఖాధికారి ఎం.ఫణిదూర్జటి, వెనుకబడిన తరగ తుల శాఖ జిల్లా అధికారి జి.రమేష్, మెగా సంస్థల ప్రతినిధులు ఫణికుమార్ పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ


