● కూటమి నాయకుల అండతో యథేచ్ఛగా తవ్వకాలు ● అడ్డుకున్న పెద్ద లింగాల గ్రామస్తులు
నందివాడ: మండలంలోని పెద్ద లింగాల గ్రామంలో చేపల చెరువులను తవ్వొద్దంటూ గ్రామస్తులు ఆదివారం పెద్ద ఎత్తున ధర్నా చేశారు. చెరువుల వల్ల సాగు, తాగునీటికి తీవ్ర కొరత ఏర్పడుతుందని గ్రామస్తులు ఆరోపించారు. చెరువు తవ్వకాల వివాదంపై సోమవారం కోర్టులో విచారణ జరగాల్సి ఉంది. విచారణ జరగక ముందే భూ యజమానులు, కూటమి నాయకులు అండ దండలతో తమకు హైకోర్టు అనుమతులు ఉన్నాయంటూ పొక్లెయిన్లు తీసుకువచ్చారు. డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీగా పోలీస్ బందోబస్తు నిర్వహించి తవ్వకాలు మొదలుపెట్టారు.
తవ్వకాలతో ఉపాధి కోల్పోతాం..
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గ్రామసభలు నిర్వహించకుండా, గ్రామస్తుల తీర్మానం లేకుండా, సచివాలయంలో సంతకాలు ఫోర్జరీ చేసి తవ్వకాలు చేస్తున్నారన్నారు. 200 మంది పోలీసులతో దౌర్జన్యంగా తమను బెదిరిస్తున్నారని చెప్పారు. మూడు రోజులు సెలవులు కావడంతో ఏ అధికారితో మాట్లాడడానికి వీలు లేకపోవడంతో తవ్వకాలకు దిగారన్నారు. సోమవారం హియరింగ్ ఉందని, ఒక రోజు తవ్వకాలు ఆపాలని వేడుకున్న పోలీసులు వినే పరిస్థితులో లేరని, హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మేము పనిచేస్తున్నామని పోలీసులు చెబుతున్నారని గ్రామస్తులు తెలిపారు. గ్రామమంతటా చేపల చెరువులు కావడంతో డ్రెయినేజీలను ఆక్రమించడంతో మురుగునీరు ఎటు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. గతంలో వరదలు సంభవించి గ్రామం నీట మునగడానికి చేపల చెరువులు ప్రధానమని, కొద్దో, గొప్పో ఉన్న పంట పొలాలను కూడా చేపల చెరువులుగా మారిస్తే పూర్తిగా ఉపాధి కోల్పోతామని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.


