పతాక స్తూప వార్షికోత్సవాల వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

పతాక స్తూప వార్షికోత్సవాల వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ

Jun 29 2026 1:59 AM | Updated on Jun 29 2026 1:59 AM

పామర్రు: మొవ్వ మండల పరిధిలో నాట్య క్షేత్రమైన కూచిపూడి గ్రామంలో ఈ ఏడాది డిసెంబర్‌ 25 నుంచి 27వ తేదీ వరకు జరిగే అంతర్జాతీయ కూచిపూడి నాట్య పతాక స్తూప వార్షిక మహోత్సవాల వాల్‌పోస్టర్‌ను ఆదివారం ఆవిష్కరించారు. గ్రామంలోని శ్రీబాలా త్రిపుర సందరీ సమేత రామలింగేశ్వరస్వామి దేవాలయం ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో కూచిపూడి హెరిటేజ్‌ ఆర్ట్స్‌ సొసైటీ కార్యదర్శి డాక్టర్‌ వేదాంతం వెంకట నాగ చలపతి మాట్లాడుతూ.. ఈ వేడుకల్లో గీత పాఠం–నాట్య వేదం, బృంద నాట్యం నిర్వహిస్తామన్నారు. గతేడాది యునెస్కో భగవద్గీత, నాట్య శాస్త్ర గ్రంథాలను, పురాతన గ్రంథాలుగా గుర్తించి వాటి ప్రాముఖ్యతను వెల్లడి చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

మూడు రోజుల పాటు నిర్వహణ..

డిసెంబర్‌ 25, 26 తేదీల్లో ప్రదర్శన పూర్వక ప్రసంగాలు ఉంటాయన్నారు. భగవద్గీతలోని 18 అధ్యాయాలలో ఉన్న 18 శ్లోకాలను నాట్య శాస్త్రంలోకి తీసుకుని గీతాపారాయణం – నాట్య వేదం పేరిట బృంద నాట్యాన్ని డిసెంబర్‌ 27న నిర్వహిస్తామని తెలిపారు. వేడుకల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది కళాకారులు పాల్గొంటారన్నారు. తొలుత నాట్యాచార్యుల ఇలవేల్పు అయిన శ్రీ బాలా త్రిపుర సందరీ అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్‌ వేదాంతం కిరణ్‌, నాట్యాచార్యులు డాక్టర్‌ యేలేశ్వరపు శ్రీనివాసులు, యేలేశ్వరపు వెంకటేశ్వర్లు, వెంపటి సత్య ప్రసాద్‌, రమణి, ఇందిరా పరాశరం, గ్రామస్తులు ఎస్‌ఎస్‌ఆర్‌ ఆంజనేయులు, యేలేశ్వరపు వెంకటేశ్వర ఫణికుమార్‌, మహంకాళి జ్ఞాన వెంకట సాయి ఫణికుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement