కోనేరుసెంటర్: గడిచిన మూడు నెలలుగా జిల్లాలో జరిగిన చోరీలతో పాటు వివిధ కారణాలతో పోగొట్టుకున్న దాదాపు 400 సెల్‌ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. వాటిని శనివారం బాధితులకు అప్పగించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. జిల్లాలో బందరు, అవనిగడ్డ, గుడివాడ, పెనమలూరు, గన్నవరం సబ్ డివిజన్‌ల పరిఽధిలో గడిచిన మూడు నెలలుగా వందలాది సెల్‌ఫోన్‌లు అపహరణకు గురి కావటంతో పాటు మరికొందరు వివిధ కారణాలతో పోగొట్టుకోవటం జరిగిందన్నారు. బాఽధితులు ఈ ఘటనలపై జిల్లా వ్యాప్తంగా సంబంధిత పోలీస్‌స్టేషన్‌లలో ఫిర్యాదు చేశారన్నారు. సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (ిసీఈఐఆర్) పోర్టల్ ద్వారా వాటిని రికవరీ చేసేందుకు జిల్లాలో సీసీఎస్ సిబ్బందిని ప్రత్యేక టీంగా నియమించినట్లు చెప్పారు. ఆ టీం ద్వారా గడిచిన మూడు నెలలుగా సుమారు 60 లక్షల ఖరీదు చేసే 400 సెల్‌ఫోన్‌లను ఐఎంఈఐ వివరాలను విశ్లేషించి ఐటీ కోర్ టీంను సమన్వయం చేసుకోవటం ద్వారా రికవరీ చేసినట్టు చెప్పారు. మచిలీపట్నం సిసిఎస్ సిబ్బంది 100, పెనమలూరు సిబ్బంది 63, గుడివాడ సిబ్బంది 237 సెల్‌ఫోన్‌లను రికవరీ చేసి ప్రతిభను కనబరచటం జరిగిందన్నారు. ఈ ఆపరేషన్‌ను సమర్ధవంతంగా నిర్వర్తించిన సిసిఎస్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఆయన ఫోన్‌లు పోగొట్టుకున్న బాధితులు పలువురికి తన చేతుల మీదుగా మొబైల్స్‌ను అందజేశారు. ప్రజలు సెల్‌ఫోన్లు పోగొట్టుకున్నట్టయితే వెంటనే సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లలో ఫిర్యాదు చేయటంతో పాటు ిసీఈఐఆర్ పోర్టల్‌లో కూడా తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఎస్పీ సూచించారు. సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడు, బందరు, పెనమలూరు, గుడివాడ సీసీఎస్ సీఐలు కేవీఎస్‌వీ ప్రసాద్, గోవిందరాజు, రమణమ్మ, ఆయా స్టేషన్‌ల ఎస్సైలు పాల్గొన్నారు.


