అంకితభావంతో విధులు నిర్వర్తించాలి | - | Sakshi
Sakshi News home page

అంకితభావంతో విధులు నిర్వర్తించాలి

Jun 26 2026 7:45 AM | Updated on Jun 26 2026 7:45 AM

అంకితభావంతో విధులు నిర్వర్తించాలి సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం పంట మార్పిడిపై ప్రత్యేక అవగాహన శిబిరాలు సత్యదేవుని నిత్యాన్నదానానికి విరాళం

చిలకలపూడి(మచిలీపట్నం): విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి ఉన్నతస్థాయికి ఎదగాలని కలెక్టర్‌ డీకే బాలాజీ సూచించారు. విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల ద్వారా వారికి నియామకపత్రాలను గురువారం ఆయన చాంబర్‌లో అందజేశారు. ఎన్‌సీసీ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా గూడవల్లి గోపీకిరణ్‌, వెల్ఫేర్‌, ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌గా సాంఘిక సంక్షేమశాఖలో కత్తుల ఆదర్శ్‌ను, గవర్నమెంట్‌ టీచింగ్‌ జనరల్‌ హాస్పిటల్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా రేమల్లె రాజశేఖర్‌ను, రెవెన్యూ విభాగంలో ఆఫీస్‌ సబార్డినేట్‌గా తూము ప్రమోద్‌ను నియమిస్తూ ఉత్తర్వులు అందజేశారు. కలెక్టరేట్‌ ఏవో ఏఎస్‌ఎన్‌ రాధిక, కలెక్టరేట్‌ సిబ్బంది పాల్గొన్నారు.

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు అడ్మిషన్ల కౌన్సెలింగ్‌లో భాగంగా పాలిసెట్‌–2026 ప్రవేశ పరీక్షలో ర్యాంకులు పొందిన వారి సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ గురువారం నుంచి మొదలైంది. పాలిసెట్‌ రాసిన అభ్యర్థుల సర్టిఫికెట్లను ఈ ఏడాది నుంచి ఆన్‌లైన్‌లోనే పరిశీలించి ధ్రువీకరిస్తామని పాలిసెట్‌–2026 ఎన్టీఆర్‌ జిల్లా కన్వీనర్‌ ఎం.విజయసారధి చెప్పారు. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించిన వెంటనే ఆన్‌లైన్‌లోనే సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి అయినట్లుగా మెసేజ్‌ వస్తుందని, ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ పూర్తి కాని వారు మాత్రం హెల్ప్‌లైన్‌ సెంటర్‌కు స్వయంగా సర్టిఫికెట్లతో వచ్చి ధ్రువీకరించుకోవాలని చెప్పారు. హెల్ప్‌లైన్‌ సెంటర్‌ వెరిఫికేషన్‌ ఆఫీసర్‌ జీవీ ఈశ్వర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): వ్యవసాయం, దాని అనుబంధ రంగాల రైతులకు సుస్థిర ఆదాయం లభించేలా ఉపాధి హామీ పథకం అనుసంధానంతో ఉద్యానపంటలు దిశగా వెళ్లడంతో పాటు పంటల మార్పిడిపై మండలాల వారీగా ప్రత్యేక అవగాహన శిబిరాలు నిర్వహించనున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్‌(చిన్ని), ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ, తెలిపారు. గురువారం ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఎంపీ కేశినేని శివనాథ్‌ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయం, పర్యవేక్షణ కమిటీ(దిశ) సమావేశం జరిగింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, జల్‌ జీవన్‌ మిషన్‌, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన, పీఎం–కిసాన్‌, ప్రధానమంత్రి మాతృవందన యోజన, దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ్‌ కౌశల్య యోజన తదితర కేంద్ర, రాష్ట్ర అనుసంధాన పథకాల అమలు తీరుపై సమీక్షించి, భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలామృతం ప్లస్‌ పోస్టర్లను ఆవిష్కరించి.. బాలామృతం కిట్లను అందజేశారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌, జెడ్పీ సీఈఓ జె. అరుణ, టాటా ట్రస్టుల జిల్లా ప్రాజెక్టు అధికారులు పాల్గొన్నారు.

అన్నవరం: సత్యదేవుని నిత్యాన్నదాన పథకానికి విజయవాడకు చెందిన అంబటి జయవేంకట చలపతి, వెంకటలక్ష్మి దంపతులు రూ.5 లక్షల విరాళాన్ని గురువారం సమర్పించారు. ఈ మేరకు చెక్కును ఈవో నల్లం సూర్యచక్రధరరావుకు అందజేశారు. ఏటా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దాతల పేరు మీద అన్నదానం చేయాలని ఆమె కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement