నేడు మొహర్రం సందర్భంగా కోనేరు సెంటర్లో చెస్ట్ బీటింగ్
మచిలీపట్నంటౌన్: ముస్లింలు గత 10 రోజులుగా దుఃఖ దినాలను పాటిస్తున్నారు. సత్యం కోసం ప్రాణాలు అర్పించిన మహ్మద్ ప్రవక్త మనవడు ఇమామ్ హుస్సేన్ ఆయన అనుచరులు 72 మంది వీరమరణం పొందడాన్ని స్మరించుకుంటూ ముఖ్యంగా షియా ముస్లింలు ఈ దుఃఖ దినాలను పాటిస్తున్నారు. సత్యం, న్యాయం, మానవత్వ పరిరక్షణ కోసం ఇమామ్ హుస్సేన్ ఆధ్వర్యంలో అధర్మ పాలకుడు ఎజిత్‌తో పవిత్ర యుద్ధం చేశారు. ఈ యుద్ధంలో వారు వీరమరణం పొందడంతో ముస్లింలు వారిని స్మరించుకుంటూ ఈ దుఃఖ దినాలను పాటిస్తున్నారు. 11వ రోజు అయిన శుక్రవారం మొహర్రం సందర్భంగా నగరంలోని వందలాది మంది ముస్లింలు స్థానిక కోనేరు సెంటర్‌కు చేరుకుని రుధిర తర్పణం(చెస్ట్ బీటింగ్) చేయనున్నారు.
దుఃఖ దినాల్లో ఇలా..
దుఃఖ దినాల్లో భాగంగా 3, 5, 7, 9 రోజుల్లో ముస్లింలు వారి ప్రాంతాల్లోని పంజాల వద్ద నిప్పుల గుండాలను తొక్కారు. మూడో రోజు నుంచి పీర్లను ఊరేగించారు. స్థానిక ఇనుగుదురుపేటలోని వంకాయల పంజాలో తొమ్మిదో రోజు అయిన బుధవారం రాత్రి బీరకాయకు తిరగలిని, సొరకాయకు 10 కిలోల బరువు ఉన్న రాయిని, వంకాయకు నీటితో ఉన్న చెంబును వేలాడదీశారు. దీనిని తిలకించేందుకు నగర ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నగరంలోని సెంటర్ డివైడర్‌ల లోని వీధి దీపాల స్తంభాలకు, కోనేరు సెంటర్ చుట్టూ నల్లజెండాలను అలంకరించారు. పదో రోజైన గురువారం స్థానిక ఇనుకుదురుపేటలోని భారీ ఇమాం పంజా వద్ద పీర్లను బయటకు తీశారు. వైఎస్సార్ సీపీ నియోజవర్గ ఇన్‌చార్జ్ పేర్ని కృష్ణమూర్తి (కిట్టు), మునిసిపల్ మాజీ చైర్మన్ షేక్ సలార్ దాదా, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ షేక్ అచ్చాబా, మాజీ కార్పొరేటర్ మీరు అస్గర్ అలీ, మాజీ కౌన్సిలర్ శీలం బాబ్జీ, నగర ఉపాధ్యక్షుడు షేక్ మహమ్మద్ సాహెబ్ హాజరయ్యారు.


