ఒకే సమస్యపై ఏడాదిగా 30 అర్జీలు | - | Sakshi
Sakshi News home page

ఒకే సమస్యపై ఏడాదిగా 30 అర్జీలు

Jun 26 2026 7:45 AM | Updated on Jun 26 2026 7:45 AM

కోడూరు: దివిసీమలోని తీరప్రాంత రైతులను వేధిస్తున్న ఒకే సమస్యపై ఏడాదిలో 30 అర్జీలు ఇచ్చినా పరిష్కారం కనిపించకపోవడం విమర్శలకు తావిస్తోంది. మండలంలోని ఇరాలి గ్రామ సమీపంలో రత్నకోడు (తాలేరు) మేజరు డ్రెయిన్‌లో నుంచి న్యూ ఇరాలి డ్రెయిన్‌లోకి ఆక్వా సాగుదారులు వేసిన అక్రమ తూముల ద్వారా ఉప్పునీరు చేరడంతో ఇరాలి, రామకృష్ణాపురం, కోడూరు గ్రామాల పరిధిలోని సుమారు 1,500 ఎకరాల వ్యవసాయ భూములు ముంపుబారిన పడి పంట రైతుల చేతులకొచ్చే పరిస్థితి లేదు. అక్రమ తూములను తొలగించాలని బాధిత రైతులు ఏడాదిగా జిల్లా కలెక్టర్‌కు పీజీఆర్‌ఎస్‌లో 20 అర్జీలు, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌కు ఎనిమిది అర్జీలు, కోడూరు తహసీల్దార్‌కు రెండు అర్జీలు చొప్పున అందించారు. ఒకే సమస్యపై రైతులు ఇప్పటి వరకు 30 అర్జీలు సమర్పించినప్పటికీ పరిష్కారం మాత్రం లభించలేదు. తాజాగా గురువారం కోడూరులో జరిగిన ప్రజాదర్బార్‌ కార్యక్రమంలో రైతులు, రైతు సంఘం నేతలు ఇదే సమస్యపై మరోసారి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్‌కు వినతిపత్రం అందించారు. దీనిపై డ్రెయినేజీ ఏఈ కీరం మాట్లాడుతూ సమస్యపై క్షేత్రస్థాయి పరిశీలనకు కలెక్టర్‌ ప్రత్యేక కమిటీని నియమించారని, ఈ నెల 29న ఉన్నతాధికారులు పరిశీలనకు వస్తారని చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement