టీడీపీ కనుసన్నల్లోనే ‘సర్‌’ | - | Sakshi
Sakshi News home page

టీడీపీ కనుసన్నల్లోనే ‘సర్‌’

Jun 25 2026 5:59 AM | Updated on Jun 25 2026 5:59 AM

టీడీపీ కనుసన్నల్లోనే ‘సర్‌’ ● అధికారపక్షానికి అండగా బీఎల్‌ఓలు ● ప్రతి సమాచారం టీడీపీకి చేరవేత ● సర్‌ను హైజాక్‌ చేస్తున్న టీడీపీ నేతలు

● అధికారపక్షానికి అండగా బీఎల్‌ఓలు ● ప్రతి సమాచారం టీడీపీకి చేరవేత ● సర్‌ను హైజాక్‌ చేస్తున్న టీడీపీ నేతలు

కంకిపాడు: స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) కార్యక్రమం ప్రహసనంగా సాగుతోంది. కార్యక్రమాన్ని పూర్తిగా టీడీపీ హైజాక్‌ చేస్తోంది. టీడీపీ నేతల కనుసన్నల్లోనే సర్‌ జరుగుతోంది. ప్రభుత్వం నియమించిన బీఎల్‌ఓలు ఉత్సవ విగ్రహాలుగా మారుతున్నారు. టీడీపీ బీఎల్‌ఏనే కాకుండా ఆ పార్టీ నేతలు అధిక సంఖ్యలో ఓటరు వద్దకు వెళ్లి ఎన్యుమరేషన్‌ ఫారాలు అందిస్తూ అంతా తామే నడిపిస్తున్నట్లు ఓటర్లను ప్రభావితం చేసే యత్నం చేస్తున్నారు.

స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) కార్యక్రమం ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభమైంది. బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి ఓటరు ఎన్యుమరేషన్‌ ఫారాలు అందజేస్తున్నారు. పెనమలూరు నియోజకవర్గం వ్యాప్తంగా పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు మండలాల్లో సర్‌ ప్రక్రియ సాగుతోంది.

అధికార పక్షంతో అంటకాగుతూ..

సర్‌ ప్రక్రియ నిర్వహణలో నియోజకవర్గంలోని అత్యధిక శాతం మంది బీఎల్‌ఓలు అధికార పక్షంతో అంటకాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎన్యుమరేషన్‌ ఫారాలు అందజేతకు అన్ని రాజకీయ పక్షాలతో బీఎల్‌ఓలు వెళ్లాల్సి ఉంది. కానీ బీఎల్‌ఓలు కొందరు మొక్కుబడిగా ఇతర పక్షాలకు సమాచారం అందించి, టీడీపీకి చెందిన బీఎల్‌ఏలతో మాత్రం నేరుగా ఓటర్ల వద్దకు వెళ్లిపోయి వారికి ఫారాలు అందజేస్తున్నట్లు తెలుస్తోంది. ఓటర్ల సమాచారాన్ని కూడా టీడీపీ బీఎల్‌ఏల ద్వారానే సేకరిస్తున్నారు. అవసరమైతే వారి వద్ద ఉన్న ఓటర్ల జాబితాపై ఓటర్ల ఫోన్‌ నంబర్లను సేకరించి టీడీపీ బీఎల్‌ఏలకు అప్పగిస్తూ నియోజకవర్గ ముఖ్యనేత దృష్టిలో పడేందుకు తెగ తాపత్రయ పడుతున్నట్లు సమాచారం.

ఉత్సవ విగ్రహాలుగా బీఎల్‌ఓలు..

సర్‌ విషయంలో ప్రభుత్వం నియమించిన బీఎల్‌ఓలు ఉత్సవ విగ్రహాలుగా మారారనే ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ పక్షాల బీఎల్‌ఏలతో కలిసి బీఎల్‌ఓ అధికారికంగా ఓటర్లకు ఎన్యుమరేషన్‌ ఫారాలు అందజేయాలి. కానీ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్‌సీపీ సహా ఇతర పక్షాలకు మొక్కుబడిగా సమాచారం ఇవ్వటంతో అసలు ఎన్యుమరేషన్‌ ఫారాలు పంపిణీ ఎక్కడ జరుగుతుందో తెలీక ఆ పార్టీలకు చెందిన బీఎల్‌ఏలు హాజరు కాలేకపోతున్నారు. టీడీపీ విషయానికొస్తే బీఎల్‌ఏతో పాటుగా ఆ పార్టీకి చెందిన బూత్‌, యూనిట్‌, క్లస్టర్‌, ఇతర ముఖ్యనేతలు అందరూ హాజరయ్యేలా, ఓటర్లకు ఎన్యుమరేషన్‌ ఫారాలు అందేలా చూస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఫారాలు అందజేతలో బీఎల్‌ఓలు ఓ మూలన నించుకుని ఉండగా, ఫారాలను ఓటర్లకు టీడీపీ నేతలే పంపిణీ చేసేస్తున్నారు. టీడీపీ హయాంలో ఓటర్ల సర్‌ నిర్వహిస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారు. తద్వారా ఓటర్లను ప్రభావితం చేసేందుకు టీడీపీ శ్రేణులు యత్నిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement