గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 27వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు విజయవాడలో ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో ‘జాబ్ మేళా’ జరుగుతుందన్నారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన 18 నుంచి 35 ఏళ్ల లోపు యువతీ, యువకులు జాబ్ మేళాకు అర్హులని పేర్కొన్నారు. మేళాలో ఎంపిక అయిన వారికి నెలకు రూ.12 వేల నుంచి రూ. 50వేల వరకు వేతనం, ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని వివరించారు. మరిన్ని వివరాలకు 9032633548, 9985759304 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడిన ఎనిమిది మందికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. విజయవాడ నగరంలోని పలు పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ఈ నెల 10 నుంచి 23 వరకూ నిర్వహించిన తనిఖీల్లో 101 మంది మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిపై కేసులు నమోదు చేసి న్యాయస్థానాల్లో ప్రవేశ పెట్టగా, వారిలో ఒకరి మూడు రోజులు, మరో ఏడుగురికి రెండు రోజుల చొప్పున జైలు శిక్ష విధించిన ప్రభుత్వం, మరో 93 మందికి రూ.9.95 లక్షల జరిమానా విధించింది.
మంగళగిరి టౌన్: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ మంగళగిరి పట్టణంలో వేంచేసియున్న శ్రీలక్ష్మీ నరసింహస్వామివారిని బుధవారం దర్శించుకున్నారు. తొలుత ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దిగువ సన్నిధిలో వున్న లక్ష్మీ నరసింహస్వామి వారికి పవన్ కల్యాణ్ పట్టు వస్త్రాలు సమర్పించారు. అర్చకులు అష్టోత్తరాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పవన్ కల్యాణ్ ఎగువ సన్నిధిలో వున్న శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని, స్వామివారికి పానకాన్ని నైవేద్యంగా సమర్పించారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి తీర్ధ ప్రసాదాలను డెప్యూటీ సీఎంకు అందించారు.
5 కేజీల గంజాయి స్వాధీనం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం అరెస్ట్ చేసింది. వారి నుంచి 5 కేజీల గంజాయి, బైక్, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా మధ్య నిషేధ, అబ్కారీ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ సీహెచ్ లావణ్య ఆదేశాలు మేరకు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం బుధవారం సితార సెంటర్‌లో తనిఖీలు నిర్వహించింది. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు యమహా ఎంటీ–15 బైక్‌పై గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు. వారిని తనిఖీ చేయగా మూడు ప్యాకెట్లలో మొత్తం 5 కేజీల గంజాయి పట్టుబడింది. ఆ ఇద్దరు జి.కొండూరు మండలం చెరువు మాధవరం గ్రామానికి చెందిన కుంచాల సూర్య తేజ, ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం గ్రామానికి చెందిన కలపాల తేజలుగా గుర్తించారు. వీరికి ఆంధ్ర–ఒడిస్సా సరిహద్దుకు చెందిన కార్తీ గంజాయి సరఫరా చేస్తున్నట్లు తేలింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం ఇరువురిని భవానీపురం ఎకై ్సజ్ స్టేషన్‌లో అప్పగించారు. గంజాయి అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులతో పాటు సరఫరా చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. సూర్యతేజ, కలపాల తేజలను అరెస్ట్ చేసి వారి వద్ద 5 కేజీల గంజాయి, బైక్, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిని కోర్టు ముందు హాజరు పరచగా రిమాండ్ విఽధించినట్లు ఎకై ్సజ్ సీఐ టి.గోపాలకృష్ణ తెలిపారు.
దుర్గమ్మకు హైదరాబాద్ వాసి రూ. లక్ష విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్‌కు చెందిన భక్తులు బుధవారం రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడకు చెందిన ఇందుకూరి హేమ శిరీషల పేరిట కుటుంబ సభ్యులు రూ. లక్ష విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.


