ఆర్టీసీ ప్రైవేటీకరణను విరమించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ప్రైవేటీకరణను విరమించుకోవాలి

Jun 23 2026 2:10 AM | Updated on Jun 23 2026 2:10 AM

చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజా రవాణా వ్యవస్థను కాపాడాలని ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలనే ఆలోచనలను విరమించుకోవాలని వైఎస్సార్‌ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ పల్లి శేఖర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌ డీకే బాలాజీకి వినతిపత్రం అందజేశారు. పల్లి శేఖర్‌ మాట్లాడుతూ ఆర్టీసీ చక్రం ప్రగతికి చిహ్నం అనే నానుడి ఉండేదని, ఇప్పుడు అది కనుమరుగయ్యే పరిస్థితులను చంద్రబాబు ప్రభుత్వం తీసుకొస్తోందన్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో నాటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుమారు రూ. 700 కోట్లు వెచ్చించి 1459 బస్సులను కొనుగోలు చేశారన్నారు. అయితే ఎన్నికలు రావడంతో ఆ బస్సులు రోడ్డు పైకి తెచ్చే అవకాశం రాలేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బస్సులను తమ ఖాతాలో వేసుకుని ఆర్భాటం చేశారన్నారు. రానున్న కాలంలో ఎలక్ట్రికల్‌ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీ ఉద్యోగులతోనే నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

పినాకిల్‌కు అప్పగించిన డిపోలను

ఆర్టీసీనే నిర్వహించాలి

12 డిపోలను ప్రభుత్వం పినాకిల్‌ కంపెనీకి అప్పగించి ప్రైవేటుపరం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని ఆర్టీసీ ద్వారానే ఆ డిపోలను నిర్వహించేలా చూడాలన్నారు. పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించటంతో పాటు పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలన్నారు. తక్షణమే అవసరమైన 3 వేల డీజిల్‌ బస్సులను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని బస్సు డిపోలను 99 ఏళ్లకు లీజుకు ఇచ్చే ప్రతిపాదన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు తాడిశెట్టి శ్రీనివాసరావు, నగర అధ్యక్షులు ఎగ్గోని గాంధీ, రాంప్రసాద్‌, మోచర్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ ట్రేడ్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో నిరసన, కలెక్టర్‌కు వినతి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement