చల్లపలి: ఎదురుగా వచ్చే వాహనాన్ని తప్పించబోయి చీకట్లో రోడ్డు కనిపించక ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడిపోయిన ఘటనలో ఓ వృద్ధుడు మృతిచెందగా, మరొకరు గాయపడ్డారు. ఈ ప్రమాదం పెదకళ్లేపల్లి రోడ్డులో గురువారం జరిగింది. మండలంలోని మంగళాపురం గ్రామానికి చెందిన రైతు పరుచూరి ప్రభాకరరావు (66) అదే గ్రామానికి చెందిన చండ్ర సుబ్బారావు పొలం పనులు ముగించుకుని, పురుగు మందుల కోసం ద్విచక్రవాహనంపై చల్లపల్లి సెంటర్‌కు వచ్చారు. తిరిగి మంగళాపురం వెళ్లేందుకు పెదకళ్లే పల్లి రోడ్డులో బయలుదేరారు. ఇంకొంత దూరంలో హైవే ఎక్కుతామనే లోపు ఎదురుగా వచ్చే వాహ నాన్ని తప్పించబోయి అప్పటికే చీకటి పడటంతో రోడ్డు కనిపించక వారి వాహనం అదుపుతప్పింది. వాహనం నడుపుతున్న ప్రభాకరరావు, వెనుక కూర్చున్న సుబ్బారావు ఇద్దరూ కింద పడిపోయారు. సుబ్బారావు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడగా, ప్రభాకరరావు ఎడమచేతి, తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే అటుగా వస్తున్న ఆటోలో ప్రభాకరరావును చల్లపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ప్రభాకరరావు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రభాకరరావుకు భార్య, ఇద్దరు కుమా ర్తెలు ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో తాను బాగానే ఉన్నానని కంగారు పడవద్దని ప్రభాకరరావు తనతో చెప్పాడని, ఆస్పత్రికి వచ్చేలోపే ప్రాణాలు వదిలాడని చెబుతూ సుబ్బారావు కన్నీరుమున్నీరయ్యారు.


