విద్యార్థుల ప్రయోగాత్మక అభ్యాసనకు సన్నాహాలు
భవానీపురం(విజయవాడపశ్చిమ): విజ్ఞాన శాస్త్రం(సైన్స్) పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులకు మాత్రమే కాకుండా వివిధ రంగాలలో కొత్త విషయాలను తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉన్న విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(అప్‌కాస్ట్) వినూత్న కార్యక్రమం చేపట్టింది. విజయవాడ భవానీపురంలోని అప్‌కాస్ట్ రీజనల్ సైన్స్ సెంటర్ (ఆర్‌ఎస్‌సీ)ను సందర్శించిన విద్యార్థులు, సైన్స్ ఉపాధ్యాయులు ఇప్పటి వరకు ఉన్న అనేక ఎగ్జిబిట్స్ ద్వారా కొత్త విషయాలను తెలుసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఇకపై ప్రయోగాత్మకంగా అభ్యసించేందుకు(ప్రాక్టికల్ లెర్నింగ్) సుమారు రూ.20 లక్షలతో 12 కంటైనర్లను ఏర్పాటు చేస్తుంది. అందుకు భవానీపురంలోని రీజనల్ సైన్స్ సెంటర్ వేదిక కానుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వివిధ పరికరాలను ఆయా కంటైనర్లలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒక్కో కంటైనర్‌లో ఒక్కో థీమ్ (పరికరాలతో సహా)ను ఏర్పాటు చేయనున్నారు. పేద, మధ్య తరగతి విద్యార్థులు తమ లక్ష్యాన్ని సాధించే దిశలో సరికొత్తగా ఏర్పాటు చేస్తున్న కంటైనర్లు ఉపయోగపడనున్నాయి.


