విద్యాశాఖ కఠిన వైఖరి సరికాదు
మచిలీపట్నంఅర్బన్: ఉపాధ్యాయుల పట్ల రాష్ట్ర విద్యాశాఖ అవలంభిస్తున్న కఠిన వైఖరి సరికాదని ఎస్టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఆల్ ఇండియా టీచర్స్ ఫెడరేషన్ ఆర్థిక కార్యదర్శి జోసెఫ్ సుధీర్ బాబు విమర్శించారు. ఆదివారం మచిలీపట్నం ఎన్జీఓ హోంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాజరు నమోదు కోసం ఉపయోగిస్తున్న ‘లీప్’ యాప్‌లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయన్నారు. అనేక సందర్భాల్లో హాజరు సరిగా నమోదుకాకపోవడం, యాప్ పనిచేయకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నప్పటికీ, ఆ లోపాలన్నింటినీ ఉపాధ్యాయులపై మోపడం తగదన్నారు. ఈ పరిస్థితిని వెంటనే సరిదిద్దకపోతే ఆందోళన కార్యక్రమాలకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. అలాగే పదో తరగతి పరీక్ష విధుల కేటాయింపులో చోటుచేసుకున్న అసంబద్ధాలను సరిచేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎస్టీయూ జిల్లా శాఖ అధ్యక్షుడు పి. ఇమ్మానియేల్, ప్రధాన కార్యదర్శి యువీ కృష్ణమూర్తి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొమ్ము ప్రసాద్, సతీష్ బాబు, సీనియర్ నాయకులు ఎంవీఎస్‌ఎన్ ప్రసాద్, కిరణ్ బాబు, వీరబాబు పాల్గొన్నారు.
ఏపీజేఏసీ కృష్ణా జిల్లా
కో చైర్మన్‌గా లంకేశ్వరరావు


