నాంచారమ్మ తిరునాళ్లకు పటిష్ట ఏర్పాట్లు
విశ్వనాథపల్లి(కోడూరు): గ్రామంలోని అద్దంకి నాంచారమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఏర్పాట్లపై స్థానిక ఆలయ ప్రాంగణంలో అధికారులు మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఎంపీడీఓ సుధాప్రవీణ్ మాట్లాడుతూ.. మార్చి రెండు, మూడు తేదీల్లో జరిగే అమ్మవారి ప్రధాన జాతరకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కృష్ణాజిల్లాతో పాటు గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారని పేర్కొన్నారు. రెండు రోజుల పాటు జరిగే జాతరకు సుమారుగా లక్ష మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందన్నారు. జాతర అనంతరం మూడో తేదీన చంద్రగ్రహణం కారణంగా ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఆలయాన్ని మూసివేసి తిరిగి రాత్రికి తెరచి భక్తులకు దర్శనం కల్పిస్తామని ఆలయ ఈఓ తిక్కశెట్టి వీరవెంకట మోహనరావు తెలిపారు. ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని సీఐ యువకుమార్ తెలిపారు. జాతరకు వచ్చే వాహనాలను వి.కొత్తపాలెం మీదుగా, తిరుగు ప్రయాణంలో నరసింహపురం మీదుగా పంపించనున్నట్టు చెప్పారు. ఇద్దరు సీఐల పర్యవేక్షణలో పది మంది ఎస్‌ఐలు, 200 మంది కానిస్టేబుళ్లు బందోబస్తును పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్ కిరణ్మయి, ఎస్‌ఐ చాణక్య, ఆలయ కమిటీ చైర్మన్ తోట సూర్యనరసింహారావు, సర్పంచ్ కొప్పనాతి శేషుబాబు, వైఎస్సార్ సీపీ రైతు విభాగం కార్యదర్శి కొప్పనాతి వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు.


