నిలిచిన సహకార సేవలు
పెనుగంచిప్రోలు: సహకార సంఘాల ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి, ఆ దిశగా ఇచ్చిన హామీలు నెరవేర్చటం లేదని ఆరోపిస్తూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక(జేఏసీ) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీనిలో భాగంగా ఈనెల 6న నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కాగా, 8న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డీసీసీబీ బ్రాంచ్‌ల ముందు సంఘాలకు తాళాలు వేసి ధర్నా నిర్వహించారు. మంగళవారం మరోసారి అన్ని జిల్లా సహకార కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. అలాగే ఈనెల 22న రాష్ట్రంలోని అన్ని డీసీసీబీ ప్రధాన కార్యాలయాల ముందు ధర్నా, వినతి పత్రం అందించటం, 29న రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాల ఉద్యోగులతో విజయవాడ ధర్నా చౌక్ వద్ద ధర్నా, ఉన్నతాధికారులకు వినతిపత్రం, జనవరి5, 2026నుంచి విజయవాడ ధర్నా చౌక్‌లో రిలే నిరాహార దీక్షలను జేఏసీ ప్రకటించింది.
ఉమ్మడి జిల్లాలో 2,000 మంది ఉద్యోగులు..
ఉమ్మడి జిల్లాలో 425 సహకార సంఘాల్లో రెగ్యులర్, రోజువారీ వేతనంతో పనిచేసే మొత్తం 2000 మంది వరకు ఉద్యోగులు ఉన్నారు. వీరందరూ ధర్నాలో పాల్గొనటంతో సంఘ కార్యాలయాలకు తాళాలు పడ్డాయి. దీంతో సహకార సంఘాలకు వచ్చిన రైతులకు ఇబ్బందులు తప్పలేదు. జిల్లాలో సహకార కేంద్రాల ద్వారా రోజు రూ.కోట్ల లావాదేవీలు జరుగుతుంటాయి. ప్రస్తుతం ఖరీఫ్ ధాన్యం అమ్మకాలు, ధాన్యం అమ్మినవారు డబ్బులు చెల్లించేందుకు సహకార సంఘాలకు వస్తున్నారు. ఇప్పటికే ఈ నెలలో 8న, 12న రెండు రోజులు తాళాలు వేశారని రైతులు అంటున్నారు. మంగళవారం కూడా సంఘాల్లో ఉద్యోగులు లేక పోవటంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా బంగారు రుణాల కోసం పదుల సంఖ్యలో రైతులు బ్యాంకు ల వద్దకు వెచ్చి వెనుదిరగడం కనిపించింది.
సమస్యల పరిష్కారం కోరుతూ
ఆందోళన బాట పట్టిన ఉద్యోగులు


