లంచం తీసుకుంటూ దొరికిన ఉద్యోగికి రిమాండ్
విజయవాడలీగల్: గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పోలవరం కుడి ప్రధాన కాలువ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయంలో ప్రింటింగ్ టెక్నీషియన్ నగేష్‌బాబుకు న్యాయమూర్తి ఈ నెల 30 వరకూ రిమాండ్ విధించారు. వివరాలివి.. పోలవరం కుడి ప్రధాన కాలువ పనులకు సంబంధించి విజయవాడకు చెందిన గుత్తేదారు నాగార్జునకు ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు నగేష్‌బాబు రూ.15వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో నాగార్జున అవినీతి నిరోధక శాఖ అధికారుల(ఏసీబీ)కు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుపై ఏసీబీ అధికారులు వలపన్ని నగేష్‌బాబు తన కార్యాలయంలో లంచం మొత్తం తీసుకుంటుండగా పట్టుకున్నారు. నిందితుడిని మంగళవారం అవినీతి ఏసీబీ కోర్టులో న్యాయమూర్తి పి.భాస్కరరావు ముందు హాజరుపరిచారు. విచారణ అనంతరం న్యాయమూర్తి ఈనెల 30వ తేదీ వరకు రిమాండ్ విధించారు. అనంతరం విజయ వాడ జిల్లా జైలుకు తరలించారు. కారుణ్య నియామకంలో ఆపరేటర్‌గా ఉద్యోగంలో చేరిన నగేష్‌బాబు 2022 నుంచి అనేక అవినీతి ఆరోపణలున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
తిరువూరు: గంపలగూడెం మండలం వినగడప తండాలో మంగళవారం కిడ్నీ రోగి మృత్యువాత పడ్డారు. గ్రామానికి చెందిన భూక్యా సత్యం(47) పదేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ఏకొండూరు మండలం కుమ్మరికుంట్లకు చెందిన సత్యం ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో వివాహమైన తదుపరి వినగడప తండాలో నివసిస్తూ కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గ్రామంలో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉన్న నీటి కారణంగా కిడ్నీవ్యాధికి గురైన సత్యం నాలుగేళ్లుగా విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో, తదుపరి తిరువూరులో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. గత శనివారం తిరువూరు ప్రభుత్వాస్పత్రిలోని డయాలసిస్ యూనిట్లో డయాలసిస్ చేస్తున్న సమయంలో అతనికి రక్తపోటు విపరీతంగా పెరిగిపోవడంతో పరిస్థితి విషమించి అపస్మారక స్థితికి చేరాడు. హుటాహుటిన సత్యంను విజయవాడ తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. అసలే పేదరికం కారణంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సత్యం కుటుంబం అతని చికిత్స నిమిత్తం లక్షలాది రూపాయలు ఖర్చు చేసినా ప్రయోజనం లేకపోయింది. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.


