జియోడెటిక్ అసెట్ మ్యాప్‌ల ఆవిష్కరణ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కచ్చితమైన పటాల(మ్యాపుల) తయారీకి, సర్వేకు జియోడెటిక్ అసెట్ రిజిస్టర్ ఎంతగానో దోహదపడుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. స్థానిక కలెక్టరేట్‌లో జియోడెటిక్ అసెట్ రిజిస్టర్, రాష్ట్ర జియోడెటిక్ అసెట్ మ్యాప్‌లను సర్వే ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల డైరెక్టర్ బీసీ పరిడాతో కలసి కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జియోడెటిక్ అసెట్ రిజిస్టర్‌లో గ్రేట్ ట్రిగ్నో మెట్రికల్ సర్వే స్టేషన్స్ (జీటీఎస్), గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్ (జీసీపీ), స్టాండర్డ్ బెంచ్ మార్క్స్ (ఎస్‌బీఎం), గ్రావిటీ రిఫరెన్స్ స్టేషన్స్, మ్యాగ్నెటిక్ రిపీట్ స్టేషన్స్, టైడల్ అబ్జర్వేటరీస్ వంటి ఆరు అసెట్స్ ఉన్నాయని చెప్పారు. వీటి ద్వారా సర్వే, మ్యాపుల రూపకల్పన మెరుగ్గా చేయవచ్చని చెప్పారు. సర్వే ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల డైరెక్టర్ బీసీ పరిడా మాట్లాడుతూ రాష్ట్రంలో స్వామిత్వ, నక్ష, అమృత్, ఏపీ రీ సర్వే వంటి కీలకమైన ప్రాజెక్టులలో సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. సర్వే ఆఫ్ ఇండియా మొదటిసారిగా తెలుగులో రూపొందించిన రాష్ట్ర పటాన్ని (మ్యాప్‌ను) కలెక్టర్‌కు అందజేశారు.


