ఏఎన్నార్ కళాశాల వజ్రోత్సవాలు ప్రారంభం
గుడివాడ టౌన్: స్థానిక అక్కినేని నాగేశ్వరరావు కళాశాల వజ్రోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభించారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పీవీ సత్యనారాయణ, డీన్ డాక్టర్ మణి, కళాశాల కరస్పాండెంట్ కేఎస్ అప్పారావు తదితరులు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు. 75ఏళ్ల క్రితం కళాశాల ఏర్పాటుకు సహకరించిన వారందరూ రైతులు కావడంతో రైతులను స్మరించుకుంటూ తొలి రోజు రైతు సదస్సు నిర్వహించారు. ఏరువాక సాగారో.. అనే చిన్నారుల నృత్యంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మనదేశంలో 15వేల మిలియన్ ఎకరాలలో పంటను పండిస్తే 145 కోట్ల మందికి భోజనం దొరుకుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ కూలీల లోటు ఉన్న నేపథ్యంలో యాంత్రీకరణవైపు రైతు దృష్టిపెట్టాలన్నారు. ప్రిన్సిపాల్ పీజేఎస్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ బీఎస్‌ఎస్ పద్మజ, ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ కొల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


