మ్యాజిక్ బస్‌తో కేయూ అవగాహనా ఒప్పందం
కోనేరుసెంటర్: కృష్ణా యూనివర్సిటీ పలు సంస్థలతో చేసుకుంటున్న అవగాహన ఒప్పందాల్లో భాగంగా మంగళవారం మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సంస్థ ఐబీఎం సంస్థతో సమన్వయంగా రానున్న 11 నెలల కాలంలో కృష్ణా యూనివర్సిటీలోని కళాశాలలు, దాని అనుబంధ కళాశాలలకు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ వంటి అత్యాధునిక సాంకేతిక టూల్స్‌తో లైఫ్ అండ్ ఎంప్లాయిబిలిటీ స్కిల్స్ మీద విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహించనుంది. అనంతరం ఆ సంస్థ ఆధ్వర్యంలోనే కొన్ని బహుళ జాతి సంస్థలలో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా అవగాహన ఒప్పందం చేసుకున్నారు. వర్సిటీ వీసీ ఆచార్య కె. రాంజీ, రిజిస్ట్రార్ ఆచార్య ఎన్. ఉష, వర్సిటీ శిక్షణ, ఉపాధి అవకాశాల డైరెక్టర్ ఆచార్య వైకే సుందరకృష్ణ, మ్యాజిక్ బస్ సంస్థ నుంచి డీజీఎం డి. శేఖర్‌బాబు, సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ సీహెచ్ మోహన్ సంస్థ ప్రతినిధులు శౌర్య, రత్న ప్రసాద్, పుష్పలత పాల్గొన్నారు.


