
ఉండవల్లిలో నవ వధువు ఆత్మహత్య
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని ఉండవల్లిలో పారాణి ఆరకముందే ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ ఖాజావలి తెలిపిన వివరాల ప్రకారం.. ఉండవల్లికి చెందిన రంగనాయకమ్మ (24)కు ఈ నెల 17వ తేదీన ఉండవల్లి సెంటర్‌లో నివాసం ఉంటున్న జితేంద్రతో వివాహం చేశారు. బుధవారం జితేంద్ర తన భార్య ఉన్న గదిలో నుంచి బయటకు వచ్చాడు. పది నిమిషాల అనంతరం తిరిగి లోనికి వెళ్లేందుకు రాగా గదికి గడియ పెట్టి ఉంది. జితేంద్ర తలుపులు పగలగొట్టగా.. రేకుల గదిలోని ఇనుప రాడ్‌కు చున్నీతో రంగనాయకమ్మ ఉరి వేసుకుని కనిపించింది. ఏడాదిగా కడుపునొప్పితో బాధ పడుతోందని, దానివల్లే ఆత్మహత్య చేసుకుందని తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.