కోనేరుసెంటర్(మచిలీపట్నం): గణపతి నవరాత్రుల నిర్వహణకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు స్పష్టంచేశారు. తన కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. పందిళ్లు ఏర్పాటు చేసే ఉత్సవ కమిటీలు పోలీసు, విద్యుత్, మునిసిపాలిటీతో పాటు గ్రామాల్లో పంచాయతీల నుంచి అనుమతులు తీసుకోవాలని సూచించారు. పందిళ్ల వద్ద సీసీ కెమెరాలతో పాటు అగ్ని ప్రమాద నివారణ పరికరాలు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లను ఉంచాలని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితి ఏర్పడితే తక్షణమే పోలీసులతో పాటు అగ్నిమాపకశాఖకు సమాచారం అందించాలని సూచించారు. ఐదు నుంచి పది మంది వలంటీర్లు విధులు నిర్వర్తించేలా చూడాలని, కమిటీ నిర్వాహకులు 24 గంటలు అందుబాటులో ఉండాలని సూచించారు. నిమజ్జనంఊరేగింపుల రూట్ మ్యాప్‌లను పోలీసులకు కచ్చితంగా తెలియజేయాలన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగేలా మండపాలు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానం పథకం అమలులో జరుగుతున్న అవకతవకలపై ఆలయ ఈఓ శీనానాయక్ దృష్టి సారించారు. ఈ నెల 11న ‘అమ్మ సన్నిధిలో లెక్కల్లోనే భోజనం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఈఓ స్పందించారు. అన్నదానం సంబంధించిన ప్రదేశాలను స్వయంగా తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. ఈ పథకంపై ఈఓ దృష్టి సారించడంతో రికార్డుల్లో భక్తుల సంఖ్య నమోదు గణనీయంగా తగ్గింది. ఈ తేడాను గమనించిన ఈఓ బాధ్యులైన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదానాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేయకపోతే కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. ఇందులో కీలక పాత్రధారిగా వ్యవహరిస్తున్న జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణ స్వామిని డోనర్ సెక్షన్‌కు బదిలీ చేశారు. ఈఓ తీసుకొంటున్న చర్యపై భక్తులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. అన్నదానంలో జరి గిన అవకతవకల్లో మరో ఉద్యోగి పాత్ర ఉందని, అతడిని కూడా అక్కడి నుంచి తప్పిస్తే పూర్తిస్థాయి ప్రక్షాళన జరుగుతుందన్న భావన సిబ్బందిలో వ్యక్తమవుతోంది.
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్య రంగంలో పీహెచ్‌డీ స్కాలర్స్ చేసే పరిశోధనా అంశాలు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ పి.చంద్రశేఖర్ సూచించారు. ఉపయోగకరమైన పరిశోధనలు, ప్రచురణల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడం అనే అంశంపై బుధవారం హెల్త్ యూనివర్సిటీలో ఆన్‌లైన్ సదస్సు జరిగింది. ఈ సదస్సులో యూనివర్సిటీ పరిధిలోని వైద్య కళాశాలల నుంచి టీచింగ్ వైద్యులు, పోస్టు గ్రాడ్యుయేట్లు, సూపర్ స్పెషాలిటీ స్టూడెంట్లు 637 మంది పాల్గొన్నారు. ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న గురుగావ్ నుంచి వచ్చిన నటాష గులాటీ మాట్లాడుతూ.. పీహెచ్‌డీలు చేసే వారు ఏదో డిగ్రీ కోసం కాకుండా, నూతన వైద్య విధానాలు, పద్ధ తులు, వైద్యం పరంగా ప్రజలకు ఉపయోకరమైన అంశాలను ఎన్నుకోవాలన్నారు. పీహెచ్‌డీ స్కాలర్స్ సమర్పించిన పత్రాలను ప్రచురణల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లినప్పుడే వాటికి సార్థ్ధకత లభిస్తుందన్నారు. ఈ సదస్సులో రిజిస్ట్రార్ డాక్టర్ వి.రాధికారెడ్డి, రీసెర్చ్ అండ్ పబ్లికేషన్స్ డైరెక్టర్ డాక్టర్ సుధ, సిబ్బంది పాల్గొన్నారు.

జెడ్పీ ఉద్యోగులకు ప్రమోషన్లు