
అక్రమాలకు అడ్డాగా ఎన్టీఆర్ వైద్య సేవలు
●చిన్న వ్యాధులు తీవ్రమైనవిగా చూపి తప్పుడు బిల్లులు
●కూటమి పాలనలో
పక్కదారి పడుతున్న పథకం
●కేవలం 14 నెలల్లోనే జిల్లాలో 9,120 థెరపీలపై 18.07 కోట్ల వ్యయం
●నాడు పేదలకు అండగా
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ
●నేడు అవినీతికి ఆలవాలంగా ఎన్టీఆర్ వైద్య సేవ
మచిలీపట్నంఅర్బన్: కృష్ణాజిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవ ఇప్పుడు అక్రమాలకు వేదికగా మారింది. ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి సంబంధించి 31 విభాగాలలో 3,257 జాబితాబద్ధమైన థెరపీ చికిత్సలు ఉన్నాయి. చిన్న చిన్న జ్వరాలతో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు తీవ్రమైన వ్యాధులున్నట్టు జాబితాబద్ధమైన థెరపీలు చూపిస్తూ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో నమోదు చేస్తున్నారు. తప్పుడు రిపోర్టులు సృష్టించి, వైద్యానికి అయిన వ్యయం ప్రభుత్వానికి పంపించి నిధులను గుంజుతున్నారు. గతంలో పేదలకు అండగా ఉన్న వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, నేడు ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో అవినీతి పథకంగా దిగజారిపోయింది.
కూటమి పాలనలో
పక్కదారి పడుతున్న పథకం
కూటమి ప్రభుత్వం నేరుగా నిధులు మంజూరు చేయకుండా ఎన్టీఆర్ వైద్య సేవల నుంచి వచ్చే నిధులతోనే ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ, అభివృద్ధి జరపాలని ఆదేశాలు ఇచ్చింది. సంపాదించిన ఆదాయంలో 20 శాతం రివాల్వింగ్ ఫండ్ గా నిల్వ ఉంచి పునరావృత సహాయం అందేలా సూచించింది. దీంతో కొన్ని ఆసుపత్రులలో వైద్య సిబ్బంది రోగుల అసలు పరిస్థితి పక్కన పెట్టి, ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో డబ్బులు వచ్చే అవకాశాలున్న జబ్బులు చూపి బిల్లులు గుంజుతున్నారు.
థెరపీల వ్యయం ఆందోళన కలిగించే స్థాయికి:
జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ఎన్టీఆర్ వైద్య సేవ వ్యయం ఆందోళన కలిగించే స్థాయికి చేరింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో కృష్ణాజిల్లాలో మొత్తం 1,381 థెరపీలకు రూ 2.87 కోట్లు వ్యయం కాగా 2023–24 లో 4,484 థెరపీలకు రూ 8.50 కోట్లు, 2024–25లో 7,078 థెరపీలకు రూ 14 కోట్లు వ్యయం అయింది. 2025 ఏప్రిల్ నుంచి జూలై వరకు కేవలం నాలుగు నెలల కాలంలోనే 2,032 థెరపీలకు రూ.4.07 కోట్లు ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి వ్యయం చూపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలల కాలంలోనే జిల్లాలో 9,120 థెరపీలపై 18.07 కోట్ల భారీ వ్యయం కావటం పథకం పూర్తిగా పక్కదారి పట్టిందనడానికి నిదర్శనం.
జాబితాబద్ధ థెరపీల పేరిట అక్రమాలు
ఎన్టీఆర్ వైద్య సేవలలో జాబితాబద్ధమైన థెరపీల పేరుతో కూడా విచిత్రమైన పరిస్థితులు వెలుగులోకి వస్తున్నాయి. ఏ థెరపీకి సంబంధం లేకపోయినా, కేవలం ఉచిత ఓపీ ఇవాల్యుయేషన్ పేరుతో రోగులను నమోదు చేసి బిల్లులు సృష్టించడం సాధారణంగా మారింది. జాబితాబద్ధమైన థెరపీలకు చెందిన ప్రీ–ఎగ్జిస్టింగ్ కేసులు కూడా కవరేజ్‌లో చేర్చుతున్నట్లు చూపించి, ఇప్పటికే చికిత్స పొందిన రోగులపై కొత్తగా ఖర్చులు చూపిస్తున్నారు. ఈ విధంగా తప్పుడు బిల్లుల సృష్టి ద్వారా నిధులు గుంజుతున్న ఘటనలు ప్రభుత్వ ఆసుపత్రులపై తీవ్ర అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
బిల్లుల దోపిడీపై ప్రజల ఆందోళన
ప్రభుత్వ బడ్జెట్ మంజూరుపై ఆధారపడకుండా, కేవలం ఎన్టీఆర్ వైద్య సేవ పథకం నుంచి వచ్చిన డబ్బులపై ఆసుపత్రులు నడుస్తున్నాయన్న వాస్తవం ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దీనిపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించాలని, తప్పుడు రిపోర్టులతో బిల్లులు సృష్టించి డబ్బులు గుంజుతున్న వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు.
నాడు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పేదల పాలిట వరం. నేడు ఎన్టీఆర్ వైద్య సేవ అక్రమాలకు అడ్డా. గతంలో చికిత్స పొందిన రోగులకు కొత్తగా ఖర్చులు చూపిస్తూ, తప్పుడు బిల్లులు సృష్టించి నిధులు గుంజుతున్నారు. కూటమి పాలనలో ఎన్టీఆర్ వైద్యసేవ అవినీతిమయం అయిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.