మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు ఐటీఐ కళాశాలల్లో చేరేందుకు మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.కనకారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతితో పాటుగా 8వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఐటీఐలో చేరవచ్చునని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 26వ తేదీలోగా ఐటీఐ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్ లోగాని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలకు స్వయంగా వచ్చి గాని దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఈ నెల 27వ తేదీన దరఖాస్తు చేసుకున్న కళాశాలకు స్వయంగా వెళ్లి సర్టిఫికెట్లను పరిశీలన చేయించుకోవాలని తెలియజేశారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి అయిన వారు మాత్రమే కౌన్సెలింగ్‌లో హాజరు అవడానికి అర్హులని తెలిపారు. ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో చేరే విద్యార్థులకు ఈ నెల 29వ తేదీన, ప్రవేటు ఐటీఐ కళాశాలలో చేరే విద్యార్థులకు ఈ నెల 30వ తేదీన కౌన్సెలింగ్ నిర్వహిస్తామని కనకరావు వివరించారు. ఇతర వివరాలకు 0866–2475575, 94906 39639, 77804 29468 నంబర్లలో సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు.
నందిగామ టౌన్: ఇంటిలోని ఫ్యాన్‌కు ఉరేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు పట్టణంలోని పాతబస్టాండ్ ప్రాంతానికి చెందిన కాసర్ల లక్ష్మయ్యకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు మనోజ్ (24) జేసీబీ ఆపరేటర్‌గా పని చేస్తూ మద్యానికి బానిసై నిత్యం మద్యం తాగుతుండటంతో పలుమార్లు తండ్రి మందలించాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కూడా మద్యం తాగి తండ్రితో వాగ్వాదానికి దిగగా తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన మనోజ్ గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. ఉదయం లేచి చూసేసరికి మనోజ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండటాన్ని గమనించిన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్కడకు చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వైవీఎల్ నాయుడు తెలిపారు. మృతుని తండ్రి లక్ష్మయ్య కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతున్నాడు.
కృష్ణలంక(విజయవాడతూర్పు): అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు బెంజిసర్కిల్ సమీపంలోని ఐరా హోటల్ ముందు సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఒక వ్యక్తి మద్యం తాగి తూలుతూ నడుస్తూ రోడ్డు పక్కన పడిపోయాడు. కాళ్లు, చేతులు కొట్టుకుంటుండగా చుట్టుపక్కల వారు అతనిని 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతిచెందాడు. మృతుని వద్ద ఊరు, పేరుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించలేదని, వయస్సు 45 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండవచ్చని తెలిపారు. హోటల్ వాచ్‌మన్ నర సింహారావు బుధవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.